Friday, November 22, 2024
HomeTrending Newsరైతువేదికలకు హైస్పీడ్ ఇంటర్ నెట్

రైతువేదికలకు హైస్పీడ్ ఇంటర్ నెట్

వ్యవసాయంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధిస్తోందని, సాగునీటి రంగంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయం సాధించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మూడున్నరేళ్లలో నిర్మించడం దేశానికి గర్వకారణమన్నారు. రాజేంద్రనగర్ లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి హబ్ ను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కృష్ణ, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటున్నామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణలో పెరిగిన పంట ఉత్పత్తులే మన విజయాలకు సాక్ష్యమన్నారు. దేశంలో ప్రతి 150 కిలోమీటర్లకు ప్రజల ఆహార అలవాట్లలో తేడా ఉంటుందని, దేశంలో 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే అని కేంద్రంలోని బీజేపీ 2023 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పింది .. అది హామీ గానే మిగిలిపోయిందని కేటిఆర్ విమర్శించారు.

తెలంగాణలో హరిత, నీలి, క్షీర, శ్వేత విప్లవాలు మొదలయ్యాయని, తెలంగాణలో చెరువు కింద చేను కాదు .. చేను కిందకే చెరువు వచ్చిందన్నారు. వ్యవసాయ స్టాళ్లను, వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అన్నిచోట్లా బోర్డులను తెలుగు భాషలో ఏర్పాటు చేయాలి .. అప్పుడే సామాన్యులకు అర్ధమవుతాయన్నారు.

అగ్రి హబ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం రైతుకు ఉపయోగపడాలని, క్షేత్రస్థాయిలో సామాన్య రైతుల ఆలోచనలు, ఆవిష్కరణలకు అగ్రిహబ్ వేదిక కావాలన్నారు. రాష్ట్రంలోని 2601 రైతువేదికలు హైస్పీడ్ ఇంటర్ నెట్ తో అనుసంధానం చేస్తున్నామని కేటిఆర్ వెల్లడించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…

కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన రంగాలలో మొదటిది వ్యవసాయం, రెండు సాగునీటి రంగం, మూడు గ్రామీణాభివృద్ధి అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడే కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో మా నీళ్లు, మా నిధులు అన్న నినాదం ఇచ్చారని తెలిపారు.

నీళ్ల మీద నిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కెసిఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సంప్రదాయ వ్యవసాయం నుండి రైతాంగం సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత కరంటు, సాగునీటి సమస్యలు తీరాయన్నారు. సగటున ఏడాదికి దాదాపు రూ.60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఖర్చుచేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని తెలిపారు.

కేవలం లక్షా 50 వేల ఎకరాలలో పండ్లు, కూరగాయల సాగుతో స్పెయిన్ దేశం ఎగుమతులలో అగ్రస్థానంలో ఉంది. వేరుశనగ పరిశోధన కేంద్రానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని, ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ది .. వేరుశనగ ఉత్పత్తిలో అర్జెంటీనను తెలంగాణ అధిగమించాలన్నారు. ఇన్నేండ్లు ఎంత సంపద, ఎంత ఉత్పత్తి కోల్పోయాం అని ఆవేదన కలుగుతుందని, కేవలం రూ.2 కు కిలో బియ్యం ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దైన్యం నుండి  .. ఈ రోజు మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు.

దొడ్డు వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్ సీ ఐ తేల్చిచెప్పిందని, రైతులు పంటల మార్పిడి మీద దృష్టి సారించాలన్నారు. వచ్చే యాసంగిలో సన్నరకాలు మాత్రమే సాగుచేయాలి .. వీలైనంత మేరకు వరి సాగును నిలిపివేసి నూనెగింజల పంటలైన వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు తదితర పంటల మీద దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది వ్యవసాయ పరిశోధనలకు రూ.100 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నాబార్డు చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, వీసీ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

అగ్రి హబ్ ప్రత్యేకతలు

వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రిహబ్‌ను ఏర్పాటు చేశారు. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేయనున్న హబ్‌ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువచేసేందుకు జగిత్యాల, వరంగల్‌, వికారాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో నిర్మించారు. రోబోటిక్‌ విధానంలో కలుపు తీయడం, డ్రోన్‌ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్‌ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్