Friday, September 20, 2024
HomeTrending NewsBalochistan: బలోచిస్తాన్ లో తీవ్రమవుతున్న చైనా వ్యతిరేకత

Balochistan: బలోచిస్తాన్ లో తీవ్రమవుతున్న చైనా వ్యతిరేకత

పాకిస్థాన్‌ వనరుల్ని చైనా కొల్లగొడుతోందని బలోచిస్తాన్ లో దశాబ్ద కాలంగా అసంతృప్తి రాజుకుంటోంది. గ్వదర్ ఓడరేవులో స్థానిక ప్రజలకు ఉపాధి దక్కకుండా కార్మికుల నుంచి అధికారుల వరకు చైనా వారికే అవకాశాలు దక్కడం తిరుగుబాటుకు దారితీసింది. అదును చిక్కినపుడల్లా చైనీయులపై…వారికి వత్తాసు పలుకుతున్న పాకిస్థాన్ సైన్యంపై బలోచ్ ప్రజలు దాడులకు దిగుతున్నారు.  తాజాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. చైనా నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ల కాన్వాయ్‌ను గ్వాదర్‌లోని ఫకీర్ వంతెనపై బలూచిస్థాన్‌ తిరుగుబాటుదారులు అడ్డుకుని దాడి చేశారు.

సమాచారం తెలిసిన వెంటనే పాకిస్థాన్‌ భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ రహదారిని బ్లాక్‌ చేశాయి. పరస్పర కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. పాకిస్థాన్‌ భద్రతా సిబ్బంది కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.

చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై దాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. గతంలో కూడా చైనా జాతీయుల లక్ష్యంగా పలు దాడులకు పాల్పడింది. కాగా, తాజా సంఘటన నేపథ్యంలో బలూచిస్థాన్‌లోని తమ పౌరులు ఇండ్లలోనే ఉండాలని చైనా సూచించింది. పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  వివిధ రాష్ట్రాల్లో తిరుగుబాటుదారులు తమ ఉనికి చాటుకుంటున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్