Friday, October 18, 2024
HomeTrending NewsBC-A : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త గండం

BC-A : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త గండం

పోలింగ్ దగ్గర పడటంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు నానా తిప్పలు పడుతున్నాయి. మెజారిటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ -కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఎదురవుతోంది. పిసిసి అధ్యక్ధుడు రేవంత్ రెడ్డి నవంబర్ 10 శుక్రవారం కామారెడ్డి బహిరంగసభలో బిసి డిక్లరేషన్ ప్రకటించారు. ముదిరాజ్ లను BC-D నుంచి BC-A గ్రూపులో కలుపుతామని ఇందులో పేర్కొన్నారు.

అదే బిసి డిక్లరేషన్ ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోంది. BC-A గ్రూపులో ఉన్న సామాజిక వర్గాలను, ఆయా కులాల పెద్దలను, మేధావులను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ముదిరాజ్ ఓట్ల కోసం కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని, పిసిసి అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారని పార్టీలోనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

BC-A కులాల హక్కుల రక్షణ సమితి పేరుతో హైదరబాద్ లో నవంబర్ 14న సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర, రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, మ్యాదరి తదితర కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముదిరాజ్ లు సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నారని, వారిని BC-A లోకి తీసుకొస్తే ఇప్పుడు ఉన్న కులాలు నష్టపోతాయని హక్కుల రక్షణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ భాగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బిసిల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Manifesto 2023 New 17 Nov

కాంగ్రెస్ మేనిఫెస్టో – 17వ పేజీలో ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఏ లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

గత రెండు రోజుల నుంచి గంగపుత్ర, రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, మ్యాదరి కుల సంఘాల్లో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ పై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా పర్వాలేదు… భవిష్యత్ తరాలకు నష్టం చేసే విధంగా తయారైన కాంగ్రెస్ కు మాత్రం వేయొద్దని అంతర్గతంగా కుల పెద్దలు ప్రచారం చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుల సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఆయా కుల సంఘాల్లో దీనిపై చాప కింద నీరులా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఉత్తర, దక్షిణ తెలంగాణ నియోజకవర్గాల్లో ఈ సామజికవర్గాలు లేని గ్రామం లేదు. హెచ్చు తగ్గులు ఉన్నా ఓటర్ల పరంగా కొన్ని ప్రాంతాల్లో గెలుపు ఓటముల్ని తారుమారు చేసే స్థాయిలో ఉన్నారు. ఈ వర్గాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. నువ్వా నేనా అన్న రీతిలో కొన్ని ప్రాంతాల్లో పోటీ నెలకొంది. అక్కడ వీరి ఓట్లే కీలకం కానున్నాయి. ఉత్తర తెలంగాణ  నియోజకవర్గాల్లో ఈ వర్గాల ఓట్లు సుమారు 30 శాతం వరకు ఉంటాయని, దక్షిణ తెలంగాణలో 25 శాతంగా ఉంటారని అంచనా.

ప్రధానంగా ఉమ్మడి మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీల గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రభావిత వర్గంగా ఉన్నారు. ఆ నోట ఈ నోటా విషయం తెలుసుకున్న పార్టీల అభ్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్