దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు; శిఖరాగ్ర సమావేశాలు; అంతర్జాతీయ దౌత్యసంబంధ చర్చలు; శాంతి చర్చలు; పరస్పర ఒడంబడికలు; వాణిజ్య ఒప్పందాలు సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతంగా, రహస్యంగా నాలుగ్గోడల మధ్య జరగాలని నియమం ఏమీ లేదు. డిప్లమసీ డీసెన్సీ, డిగ్నిటీ, కర్టసి, ఇమ్యూనిటీ లాంటి మర్యాదపూర్వక పదబంధాలు ఎన్నయినా భాషలో ఉండవచ్చు. కానీ భావంలో ఆ మర్యాదలు అలాగే ఉండాలని నియమం ఏమీ లేదు.
మన ఊరి చేపల మార్కెట్ కంటే ఘోరంగా పబ్లిగ్గా పదుగురి ముందూ, లైవ్ కెమెరాల సాక్షిగా వాదులాడుకోవచ్చు. ఇసుక రీచుల్లో కండబలం కలిగిన అధికార పార్టీ లోకల్ లీడర్లకంటే ఘోరంగా వ్యవహరించవచ్చు. మద్యం సిండికేట్ల గూడు పుఠాణీలు దాటి పుష్ప వైల్డ్ ఫైర్ సిండికేట్లలా పరమ అరాచకంగా తగ్గేదే ల్యా అని తొడలు కొట్టుకోవచ్చు. వీధి కొళాయిల దగ్గర ఒకనాడు మంచినీటి బిందెలు నింపుకోవడానికి జుట్లు పట్టుకున్న మగువలను మరిపించవచ్చు. సారా కొట్ల దగ్గర తాగి తన్నులాడుకునేవారు, పబ్బుల్లో గబ్బు తిని తాగి పీల్చి అమర్యాదగా ప్రవర్తించేవారే నయమనిపించేలా పాతాళం లోతులకు దిగిపోవచ్చు.
అమెరికా అధ్యక్షుడి వాషింగ్టన్ వైట్ హౌస్ ఒవెల్ ఆఫీస్ అధికారిక భవనం. రెండో సారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్. పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఆ పక్కన అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్. చుట్టూ స్టిల్, వీడియో కెమెరాలు. ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు. అటు ఇటు ఇరుదేశాల రాయబారులు. అధికారులు. గది నిండా మీడియా ప్రతినిధులు.
“రష్యాతో ఎన్నాళ్ళు ఈ యద్ధం? ఇక చాలు. ఆపి నేను చెప్పినట్లు వెంటనే వెళ్ళి పుతిన్ తో చేయి కలిపి…బతికి బలుసాకు తిను!” అని ట్రంప్ తనదైన శైలిలో తడుముకోకుండా చెప్పాడు.
“తొక్కలో నువ్వేమిటి చెప్పేది! నేనేమిటి వినేది? అప్పుడు ఒబామా, తరువాత బైడెన్ మాకు చేసిన పెద్ద సాయమేమీ లేదు. మీ అవసరాలు, మీ ఎత్తుగడలు మీవి…మా అస్తిత్వం, మా యుద్ధం మాది. తగ్గేదే ల్యా” అని జెలెన్ స్కీ అన్నాడు.
“నీ పిచ్చి పంతానికి మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. లక్షలమంది చస్తున్నారు. కమాన్! లెట్స్ స్టాప్ అట్ దిస్ పాయింట్. స్టాప్ ది వార్” అని ట్రంప్ హెచ్చరించాడు.
“ఓసోస్! పో పోవోయ్! నీలాంటివాళ్ళను చాలా మందిని చూశాను. యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. దిక్కున్నచోట చెప్పుకో పో! జెలెన్ స్కీ ఇక్కడ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి రష్యాకు మైండ్ బ్లాంక్ అవుతుందో! వాడే వీడు” అని పూరీ జగన్నాథ్ పోకిరీ డైలాగ్ చెప్పాడు జెలెన్ స్కీ.
ట్రంప్ దేశముదురు డైలాగ్ చెప్పాడు.
జెలెన్ స్కీ పుష్ప-2 డైలాగ్ చెప్పాడు.
మధ్యలో వాన్స్ షోలే డైలాగ్ చెప్పాడు.
ఈలోపు కోట్ వేసుకుని, మెడకు బిర్రుగా టై బిగించుకున్న ఒక అమెరికా జర్నలిస్ట్-
“ఇంతటి దౌత్య చర్చలకు మీరేమిటి కనీసం కాలర్ లేని టీ షర్ట్ వేసుకుని ఇంత ఇన్ఫార్మల్ గా వచ్చారు?” అని జెలెన్ స్కీని లోకోత్తరమైన ప్రశ్న అడిగాడు.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
“ఏం? నీకేమన్నా ప్రాబ్లమా? యుద్ధం ఆగేవరకు నేను కోట్ వేసుకోను”- అని పూర్వాశ్రమంలో స్టాండప్ కమెడియన్ అయిన జెలెన్ స్కీ అనితరసాధ్యమైన సమాధానమిచ్చాడు.
ఇలా సుహృద్భావ వాతావరణంలో ఎటూ తేలకుండా మధ్యలోనే ఆగిపోయిన ఈ దౌత్య/ద్వైపాక్షిక చర్చల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనం రాయడానికి రెండు మూడు సార్లు ఆ వీడియోలు చూడాల్సివచ్చింది. ఒక దశలో చొక్కాలు పట్టుకుని పరస్పరం వీధి రౌడీల్లా కొట్టుకుంటారేమో! మొహం మీద పిడి గుద్దులు గుద్దుకుంటారేమోనని హిచ్ కాక్ సస్పెన్స్ మూవీ చూసినంత నరాలు తెగే ఉత్కంఠతో చూశాను. అమెరికా అదృష్టం కొద్దీ అదొక్కటీ జరగలేదు- నా అదృష్టం కొద్దీ నా నరాలు తెగలేదు తప్ప…మిగతావన్నీ జరిగాయి!
ఫల శ్రుతి:-
- ఆ వీడియోలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి చూడవచ్చు.
- డిప్లొమాటిక్ మీటింగుల్లో స్టాండప్ కామెడీ కోసం చూడవచ్చు.
- యుద్ధనీతిలో అవినీతి రీతులకోసం చూడవచ్చు.
- ఎవడి యుద్ధానికి ఎవడు స్పాన్సరరో? ఎవడు తెరవెనుక కర్త-కర్మ-క్రియో తెలుసుకోవడానికి చూడవచ్చు.
- అప్పుడు అమెరికా చేసిన సాయానికి ఇప్పుడు ఉక్రెయిన్ సహజవనరులను పీల్చి పిప్పి చేయడానికి వేసే పాచికలను పసిగట్టడానికి చూడవచ్చు.
- విపరీత స్వభావపు దేశాధినేతలకు బ్రహ్మరథం పట్టే కాలంలో వారి ఇష్టాయిష్టాలు దేశాలమధ్య పెట్టే ఆరని చితిమంటల విషాదాలను తెలుసుకోవడానికి చూడవచ్చు.
- ఒక ఉక్రెయిన్ చిట్టెలుక అమెరికా సింహం గుహలో దూరి…సింహాన్ని సవాలు చేయడం వెనుక యూరోప్ దేశాలు నూరిపోస్తున్న ధైర్యం ఎంతో తెలుసుకోవడానికి చూడవచ్చు.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
- యుద్ధమొక వ్యాపారం; వ్యాపారమొక యుద్ధం ఎలా అవుతుందో, అయ్యిందో, కాబోతోందో తెలుసుకుని…ఏడ్చి…మొహం కడుక్కోవడానికి చూడవచ్చు.
- విశ్వశాంతి విశ్వకవుల భావనల్లో మాత్రమే కవిత్వంగా అణిగిమణిగి ఉండి నోబుల్ శాంతి బహుమతులకు మాత్రమే ఎలా ఉపకరిస్తుందో తెలుసుకోవడానికి చూడవచ్చు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు