మేడారం మహాజాతర ఈ రోజు(శనివారం)తో ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగిసింది. మేడారం జాతరలో మూడో రోజు కూడా అదే జోరు కొనసాగింది. సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం భక్తులు మేడారానికి పోటెత్తారు. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా.. శుక్రవారం 25 లక్షల మందికిపైగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం దాదాపు కోటి 50 లక్షల మంది వనదేవతలను సందర్శించారు. శనివారం సాయంత్రం అడవి తల్లుల వనప్రవేశంలోగా మరో 10 నుంచి 15 లక్షల మంది దర్శనం చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విజయవంతం చేసిన అధికారులను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో వనదేవతల జాతర సజావుగా జరిగిందన్నారు. అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని చెప్పారు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని వెల్లడించారు. అందరి సహకారంతో జాతర విజయవంతం చేయగలిగామని, జాతర ఏర్పాట్లు, నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
జాతర విజయవంతం అయ్యేందుకు సహాకరించిన అన్ని శాఖల అధికారులను మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే సీతక్క, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిదులతో పాటు తమంత సమన్వయంతో పని చేయడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా వరుసగా నాలుగు జాతరలను పర్యవేక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వనదేవతల చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. రానున్న రోజుల్లో దేవాదాయ శాఖ తరపున రూ. 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటిరీ, క్యాంటీన్ , ఇతర సౌకర్యాలతో వసతి గృహల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.