Changing Paradigms of TV News Presentation
ఈమధ్య ఒక తెలుగు సినిమా హీరో బైక్ మీద పడి, స్పృహలేని స్థితిలో ఆసుపత్రిలో చేరితే…సహజంగా మీడియా అనేక కోణాల్లో వార్తలు వండి, వార్చి , వడ్డించింది. అదే సమయానికి ఒక ఆరేళ్ల పాపను ఒకడు అత్యాచారం చేసి, చంపేస్తే…ఆ వార్తకు తగినంత సమయం, చోటు దొరకలేదు.
హీరో చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు పడిగాపులు పడుతున్న కెమెరాలు, లైవ్ వ్యాన్ల ముందు కొందరు యువకులు నిరసన వ్యక్తం చేశారు. సెలెబ్రిటీలు తుమ్మినా, దగ్గినా చర్చోప చర్చలు జరిపే మెయిన్ స్ట్రీమ్ మీడియా ధోరణి మీద సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. కలవారి ఒంటి మీద కంది గింజంత పుండు లేచినా…పుడమికి అది తెలుసుకుని తీరాల్సిన పెద్ద వార్త అవుతుందని వేమన ఏనాడో చెప్పాడు.
ఒక అందమయిన మొహం ఫోటో లేదా వీడియోను మీడియా ఎన్ని సార్లయినా చూపడానికి సిద్ధంగా ఉంటుంది. మామూలు మొహాలు, పేద మొహాలను చూపితే జనం చూడరని మీడియా నమ్మకం. దీనికి ఇటీవలి ఉదాహరణలు ఎవరికి వారు గుర్తుకు తెచ్చుకోవచ్చు.
పాతాళభైరవిలో మాటల మాంత్రికుడు పింగళి నేపాళ మాంత్రికుడు ఎస్ వి ఆర్ చేత ఒక డైలాగ్ చెప్పించాడు.
“జనం చూసేది మనం చేయడమా?
మనం చేసేది జనం చూడడమా?”
అసాధారణమయిన పింగళి ఒక్కొక్క మాట ఒక్కో గ్రంథంతో సమానం.
అలా-
“మీడియా చూపేది విధిలేక జనం చూడడమా?
జనం చూస్తున్నారని మీడియా చూపడమా?”
అన్నది ఇప్పుడు చర్చ.
అనేక రకాల సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక జనం మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఉతికి ఆరేస్తున్నారు.
ఆమధ్య ఒక యాంకరమ్మ నీళ్లను “రుధిరం” అంటే కళ్లల్లో రక్తం కారేలా జనం వెంటపడ్డారు. మొన్న ఒక యాంకరయ్య పోక్సో చట్టాన్ని “పోస్కో”అంటే ఉస్కో అని వెంటపడ్డారు. పడుతూనే ఉన్నారు. ఇంకా ఇలాంటివే తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులను జనం క్షమించడం లేదు. వాటి మీద వెను వెంటనే మీమ్ లు చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు.
పత్రికల్లో తప్పు దొర్లితే మరుసటి రోజు సవరణ/వివరణ ఇచ్చుకుంటున్నారు. అది మర్యాద. సంప్రదాయం. టీ వీ ల్లో కూడా తప్పులు దొర్లినప్పుడు, ఆ తప్పును లోకం పట్టుకున్నప్పుడు…సవరణ/వివరణ చెప్పినా, స్క్రోల్ లో ఒక మాటగా వేసినా టీ వీ ల గౌరవం పెరుగుతుందే తప్ప, తగ్గదు.
ప్రేక్షకుల రక్తం కళ్ల చూస్తే తప్ప యాంకర్ల రుధిర దాహం తీరకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతిదీ తెలిసి ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత తెలిసినా తప్పులు దొర్లడం సహజం. అందునా టీ వీ ప్రత్యక్ష ప్రసారాల్లో తప్పులు దొర్లడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. కెమెరా ముందు తోలు రంగుకు మేకప్పులు, మ్యాచింగ్ డ్రెస్సులు, జుట్టు వంకర్లు ప్రధానమవుతాయి. వీటన్నిటికి తోడు ప్రాంప్టర్ లో రోల్ అవుతున్న టెక్స్ట్ ను చూడకుండా చదువుతున్నట్లు మేనేజ్ చేయాలి. ఇది చెప్పినంత సులభం కాదు. కానీ విషయం మీద, పారిభాషిక పదాల మీద పట్టు, అవగాహన ఉన్నవారికి ఇది ఆట. లేనివారు బొమ్మల్లా చదివి వెళ్లగలరే గానీ, ఆ వార్తను అర్థం చేసుకోలేరు. ఆ వార్త ఆత్మను అనుభవించలేరు. మనకు అర్థమయ్యేలా చెప్పలేరు. మనం అనుభవించేలా చేయలేరు.
భావం అందరికీ గొప్పగానే ఉంటుంది. కానీ ఆ భావానికి తగిన పదాలు, పదబంధాలు, కొన్ని మాటల మీద స్ట్రెస్, వాక్యం చివర ప్రశ్న, ఆశ్చర్యార్థం ఉంటే వాటి ధ్వనిని పలికించడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్ధాంతరంగా ముగిశాయి” అన్న విషయం తెలిసి దాన్ని వార్తగా కెమెరా ముందు చెప్పేవారి టోన్ ఒకలా ఉంటుంది. పార్లమెంట్, వర్షాకాల సమావేశాలు, మధ్యలోనే వాయిదా పడ్డం అసలేమాత్రం తెలియనివారు చదివే టోన్ ఒకలా ఉంటుంది. ఈ తెలియడం, తెలియకపోవడాన్ని మాటల మధ్య ఇచ్చే పాజ్ పట్టిస్తుంది.
పదాలను వెతికి వెతికి చదివితే అది రోబో యంత్రం. కాచిగూడ…నుండి…లింగంపల్లి…వెళ్లే…లోకల్…ట్రెయిన్…ఒకటి…ఏడు…మూడు…ఏడు…ఏడు…ఏడుస్తూ…మూడో…నంబరు…ప్లాట్ ఫామ్…పైకి…వచ్చి…యున్నది…అని కర్ణ కఠోరంగా విరిచి విరిచి అన్నా మనకు అర్థమవుతూనే ఉంది.
అలాగే టీ వీ యాంకర్ల భాషను కూడా విని విని చెవులు అలవాటు పడ్డాయి. ఇమ్యూనిటీని పెంచుకున్నాయి.
పదాలమధ్య ఏది దేనికి విశేషణమో, ఏ విరుపు దేనికి అన్వయమో తెలిసేలా గొలుసు తెగకుండా, సహజంగా, భాష అందం దెబ్బతినకుండా కెమెరాల ముందు మాట్లాడ్డం ఒక కళ. ముక్కు మొహం, కారు తెలుపు ప్రధానమయిన ఫొటోజెనిక్ యాంకర్లకు సాధారణంగా భాషతో ఆజన్మ శత్రుత్వం ఉంటుంది. కాబట్టి నేరం వారిది కాదు.
చూస్తున్న మనది!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read: