తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనులు తుదిదశకు చేరుకొన్నాయి. అతిస్వల్పకాలంలోనే అందుకు సంబంధించిన నీటి ఎత్తిపోతలను ప్రా రంభించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015 లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకొన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా, కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించి అప్రోచ్ చానళ్లు, పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్‌లు, 50 కిలోమీటర్ల మేర ఓపెన్ కాలువలు, దాదాపు 62.21 కిలోమీటర్ల సొరంగాలు, కాలువల నిర్మాణం పనులు, మూడు 400/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. అంజనగిరి 8.51 టీఎంసీలు (నార్లాపూర్), వీరాంజనేయ 6.55 టీఎంసీలు (ఏదుల), వెంకటాద్రి 16.74 టీఎంసీలు (వట్టెం), కురుమూర్తిరాయ 17.34 టీంఎసీలు (కరివెన), ఉద్ధండాపూర్ 16.03 టీఎంసీల సామర్థ్యంలో రిజర్వాయర్ల పనులన్నీ తుదిదశకు చేరుకొన్నాయి.
సీఎం ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా మొదటి దశలో భాగంగా తాగునీటి ఎత్తిపోతలను ప్రారంభించడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అధికారులు టెస్టింగ్ పనులను నిర్వహిస్తున్నారు. 145 మెగావాట్ల సామర్థ్యంగల భారీ పంపుల అమరిక కూడా పూర్తయింది. పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్ సామగ్రి పనితీరును పరిశీలిస్తున్నారు. 400 కేవీ సబ్‌స్టేషన్లకు సంబంధించి ట్రాన్స్‌మిషన్ పనులు పూర్తికాగా, ప్రస్తుతం రీచార్జి ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి దశను ప్రారంభిస్తే మొత్తంగా 16 నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటికుంటలు, చెరువులను నింపి 1,226 గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. అందులో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కూడా ఉన్నాయి.