Wednesday, June 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇలపై నడిచిన దేవుడు .. శ్రీ ఆదిశంకరులు

ఇలపై నడిచిన దేవుడు .. శ్రీ ఆదిశంకరులు

భారతదేశంలో హిందూధర్మాన్ని బలహీన పరచడానికి కొన్ని మతాలవారు బలమైన ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. హిందూ ధర్మాన్ని గురించి విష ప్రచారాలు చేస్తూ, తమ మతం గొప్పదనే విషయాన్ని చాటడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఆ మాటలకు ప్రభావితమై ఆ మార్గం దిశగా అడుగులు వేయడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటే, ఏది నిజమో .. ఏది అబద్ధమో తేల్చుకోలేక సతమతమైపోయేవారు మరికొంతమంది. అలాంటి పరిస్థితుల్లోనే హిందూ ధర్మంపై వెలుగు రేఖలు ప్రసరింపజేస్తూ ఆదిశంకరులవారు ఆ దిశగా అడుగులువేశారు.
కేరళ – ‘కాలడి’లో శివగురు – ఆర్యాంబ దంపతులకు పరమశివుడి అనుగ్రహంతో, వైశాఖ శుద్ధ పంచమి రోజున .. ‘ఆరుద్ర’ నక్షత్రంలో శంకరులవారు జన్మించారు. ఆయన ఆయుష్షు చాలా తక్కువనే విషయం శివగురుకు తెలుసు. అయినా తనకి జ్ఞానవంతుడైన కుమారుడే కావాలని కోరుకోవడం ఆయన వ్యక్తిత్త్వానికి నిదర్శనం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన శంకరులవారు, సమస్త శాస్త్రాలలో సారాన్ని అర్థం చేసుకుంటారు. దూరంగా ఉన్న ‘పూర్ణానది’ నుంచి తల్లి మంచినీళ్లు తేలేక అవస్థలు పడుతుండటం చూసి, ఆ నది ప్రవాహ మార్గాన్ని తన ఇంటి ముందుగా మళ్లించిన మహిమను పసితనంలోనే చేసినవారాయన.

తల్లి అనుమతితోనే సన్యాసాన్ని స్వీకరించిన శంకరులవారు ఒక రోజున భిక్షాటన చేస్తూ ఓ ఇంటికి వెళతారు. పేదరికంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు తన ఇంట్లో ఉన్న ఒక ‘ఉసిరికాయ’ను ఆయన భిక్షా పాత్రలో వేస్తుంది. శంకరులవారికి ఆ ఇల్లాలి పరిస్థితి ఏమిటనేది అర్థమవుతుంది. దాంతో ఆయన ఆ పేద కుటుంబాన్ని అనుగ్రహించమని లక్ష్మీదేవిని కోరుతూ ‘కనకధార’ స్తోత్రం చేస్తారు. మురిసిపోయిన అమ్మవారు ఆ ఇంట ‘బంగారు ఉసిరికాయలు’ కురిపిస్తుంది. పైన జరిగిన ఈ రెండు సంఘటనలతో శంకరులవారి గొప్పతనం వెలుగులోకి వస్తుంది.

అయితే శంకరులవారు ఆ విషయాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా వెలుతురు ప్రవాహంలో తనని నడిపించే గురువును అన్వేషిస్తూ వెళ్లాలనుకుంటారు. తలచుకున్న వెంటనే తల్లి ముందు ఉంటానని ఆమెకి మాట ఇచ్చి బయల్దేరతాడు. అలా ఎంతో దూరం ప్రయాణం చేసిన శంకరులవారికి నర్మదానది తీరంలో గోవిందభగవత్పాదుల దర్శనం లభిస్తుంది. ఆయన శంకరులవారిని తన శిష్యుడిగా అంగీకరిస్తారు. అక్కడ ఆయన వేదాలలోని సారాన్ని గ్రహిస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే ‘నర్మాదా’ నదికి వరదలు వస్తాయి. తన గురువు తపస్సులో ఉన్న గుహ వైపు వరద వస్తుండటం గమనించిన శంకరులవారు, తనకి గల శక్తితో ఆ వరద నీరు తన ‘కమండలం’లో ఇమిడిపోయేలా చేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తారు.

గోవింద భగవత్పాదుల శిష్యరికంలో శంకరులవారు అనంతమైన జ్ఞాన సముపార్జన చేస్తారు. పరమశివుడు ఆయనకి చండాలుడి రూపంలో ఎదురై, ఆయన ఆలోచనా విధానంలో మరింత మార్పును .. అనుసరించవలసిన మార్గం పట్ల స్పష్టతను తీసుకొస్తాడు. శంకరులవారు బ్రహ్మసూత్రాలకు .. భగవద్గీతకు .. విష్ణు సహస్రనామానికి భాష్యం వ్రాశారు. సత్యము ఎప్పటికీ మారదు .. అదే బ్రహ్మము. జగత్తు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కనుక అది మిథ్య. జీవాత్మ .. పరమాత్మ వేరు వేరు కావు. ఈ రెండూ ఒక్కటే .. అదే అద్వైతం అని చెప్పిన శంకరులవారు, ఆ విషయాన్ని ప్రచారం చేయడానికిగాను తన శిష్యులతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తారు. విజయయాత్రలు చేస్తూ తన వాదనలతో ఇతర మతాలకి చెందిన పండితులను ఓడించి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు.

కాశీ వెళ్లిన శంకరులవారు అక్కడ తన ఆశ్రయాన్ని కోరిన సనందుడికి శిష్యరికం ఇస్తారు. ఈ సనందుడే తనకి గల గురుభక్తితో గంగానదిలో నీటిపై నడుస్తాడు. అతని గురుభక్తికి మెచ్చిన గంగాదేవి ఆయన పాదాలు నీటిలో మునగ కుండా పద్మాలను ఉంచుతుంది. అందువల్లనే తరువాత కాలంలో ఆయన ‘పద్మపాదుడు’ అనే పేరుతో పిలవబడ్డాడు. శంకరులవారిని కాపాలికులు అపార్థంచేసుకుని ఆయనను అంతంచేయడానికి పథకంవేస్తారు. అప్పుడు నరసింహస్వామి సింహం రూపంలో వచ్చి ఆయన ప్రాణాలను కాపాడతాడు.

తన తల్లి అవసాన దశలో ఉందని గ్రహించిన శంకరులవారు ఆకాశమార్గంలో ఆమె దగ్గరికి చేరుకుంటారు. ఆమెకి శివకేశవుల దర్శన భాగ్యం లభించేలా చేసి, ముక్తి కలిగేలా చేశారు. ఆ సమయంలో ఆయన చెప్పిన ‘మాతృ పంచకం’ మనసులను కదిలించి వేస్తుంది. ఆ తరువాత మహా అహంభావి అయిన మండనమిశ్రుడితో శంకరులవారువాదనకు దిగుతారు. అయితే శంకరులవారి విజయం తథ్యం అని గ్రహించిన మండనమిశ్రుడి భార్య ఉభయభారతి, కామశాస్త్రం గురించి తెలియని ఆయన పూర్ణజ్ఞాని కాలేడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ విషయాన్ని గ్రహించడానికి కొంత సమయం కావాలని శంకరులవారు అడుగుతారు. అదే సమయంలో ‘అమరక’ మహారాజు చనిపోవడంతో, తన శరీరాన్ని రక్షిస్తూ ఉండమని శిష్యులతో చెప్పిన శంకరులు, ‘అమరక’ మహారాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తారు.

అమరక మహారాజులా వ్యవహరిస్తూనే ఉభయభారతి ప్రశ్నలకు అవసరమైన సమాధానాలను శంకరులవారు తెలుసుకుంటారు. అయితే మహారాజు ప్రవర్తనలో మార్పు గ్రహించిన పరివారం, ఆయన శరీరంలోకి ఎవరో పరకాయ ప్రవేశం చేశారని గ్రహిస్తారు. తమ రాజ్యంలో ఏవారైనా ఎక్కడైనా పార్థివ శరీరాలను భద్రపరిచినట్టయితే, వాటిని వెంటనే దహనం చేయమని సైన్యాన్ని పంపిస్తారు. శంకరులవారి శరీరాన్ని దహనం చేయడానికి సైనికులు ప్రయత్నిస్తుండగా, చివరి నిమిషంలో వచ్చి ఆయన తన దేహంలోకి ప్రవేశిస్తారు. ఉభయభారతి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి .. మండనమిశ్రుడిని ఓడించి తన శిష్యుడిగా చేసుకుంటారు.

ఈ జ్ఞాన ప్రయాణంలో ఆయన ‘శివానందలహరి’ .. ‘సౌందర్యలహరి’ ‘.. శ్రీలక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రామ్’ .. ‘భజగోవిందం’ … ‘కనకధార’ .. ‘సుబ్ర్రహ్మణ్య భుజంగ స్తోత్రం’ .. ‘శ్రీదక్షిణామూర్తి స్తోత్రం’ తదితర రచనలు ఈ లోకానికి అందించారు. పూరి .. శృంగేరి .. ద్వారక .. బదరీనాథ్ క్షేత్రాల్లో ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించిన ఆయన, భవిష్యత్తులో ఈ నాలుగు పీఠాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ .. హిందూధర్మ వైభవానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాయని శిష్యులతో చెప్పి శరీరాన్ని వదిలేస్తారు.

ఆదిశంకరులవారు శివకేశవులను .. ఆదిశక్తి స్వరూపమైన అమ్మవారిని సమానంగా ఆరాధించారు. ఆయన అందించిన స్తోత్రాలు అందుకు ఉదాహరణలు. ఆ స్తోత్రాలు నేటికీ ప్రతి ఇంటా .. ప్రతి నోటా మోగుతూనే ఉన్నాయి. ఆయన శబ్ద సౌందర్యాన్ని తలచుకుని పులకించిపోతూనే ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక శిఖరాలపై హిందూ ధర్మ పతాకాన్ని రెపరెపలాడించిన అపర శంకరులు ఆయన. కృష్ణుడి తరువాత జగద్గురువు అనిపించుకున్నది శంకరులవారు మాత్రమే. సనాతన ధర్మ సంరక్షకుడిగా .. సాక్షాత్తు శివస్వరూపంగా చెప్పబడే శంకరులవారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి .. ఆయన అందించిన జ్ఞానామృతంతో దాహం తీర్చుకోవాలి.

(జయంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్