కాలం అనంతం. నిరంతరాయం. కాలంలో కొలతలన్నీ మన సౌకర్యం కోసం, ఫలానాది ఫలానా అప్పుడు జరిగిందని చెప్పుకోవడం కోసమే తప్ప మరొకటి కాదు. స్థూలంగా గతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడుగా సూచించుకుంటుంటాము. వీటిలో గతమూ అనంతమే, భవిష్యత్తూ అనంతమే! వర్తమానం… ఉందా, లేదా అన్నట్లుండేది. మనం ఈ మూడిటి గురించీ మాట్లాడుకోవచ్చు. గతం జరిగిపోయింది కాబట్టి రకరకాల ఆధారాలను బట్టి ఇట్లా జరిగిందని తెలుసుకుంటాం. భవిష్యత్తు ఊహించదగిందే తప్ప నిర్దిష్టం కాదు.
భారతీయులకు కాలస్పృహ ఉన్నంతగా చరిత్ర స్పృహ ఉన్నట్లు కనిపించదు. లౌకిక విషయాల పట్ల వైరాగ్యం మనకు గుణం కూడా! అనుకూలంగా ఉంటే రక్తి, అననుకూలమైతే విరక్తి… మామూలు మనుషులకు సర్వసాధారణం. స్వీయ విషయాలయినా, సమకాలిక విషయాలయినా… ఉంటే అతిరక్తి. లేకపోతే పూర్తి అనాసక్తి, రోజువారీ ఆదాయవ్యయాలూ, ఇతర కార్యక్రమాలూ గురించి పైసా తేడా రాకుండా డైరీలు నింపేవాళ్ళున్నట్లే, డైరీలో రాయవలసిన విషయమేమిటో నిర్ణయించుకోలేక ఖాళీగా వదిలేసేవాళ్ళూ ఉంటారు. అసలు డైరీయే దండగనేవాళ్ళూ ఉంటారు.
చరిత్రను ఎప్పటికప్పుడు రాసిపెట్టకపోతే ఏం జరుగుతుంది? మనకు మన గతం తెలియకుండా పోతుంది. వర్తమానంలోనూ, భవిష్యత్తు కోసమూ నేర్చుకోవలసిన పాఠాలెన్నో దొరక్కుండా పోతాయి. సత్యాలు తెలియకపోగా, అసత్యాలూ, అర్ధసత్యాలూ ప్రచారంలోకి వస్తాయి. మన చరిత్ర మనకు తెలిసినదాని కంటే మిగిల్చిన ప్రశ్నలే ఎక్కువ.
మన వర్తమానం గురించే ఏకకాలంలో సత్యాసత్యాలు పోటాపోటీగా ప్రచారం పొందుతున్నాయంటే… గతం సంగతి చెప్పేదేముంది?
అందుకే మనకు నిజాయితీ గలిగిన చరిత్రకారులు కావాలి. ఏ అంశం గురించైనా సత్యశోధన చేసి, పక్షపాత రహితంగా సత్యాన్ని వెల్లడించే పరిశోధకులు కావాలి. మన చరిత్రకు సంబంధించి ప్రతి అంశంలోనూ ఇది అవసరమే.
చలనచిత్రం/ సినిమా/ఫిల్మ్ అన్నది మానవ చరిత్రలో నిన్నటిది. అయినా చలనచిత్ర చరిత్రకు సంబంధించి ప్రచారంలో ఉన్న అనేక విషయాల ప్రామాణికత ఇప్పటికీ సందిగ్ధమే! అందుకే, పరిశోధకులకు పని తగులుతుంది.
రెంటాల జయదేవ ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు. సీనియర్ కాక ముందు నుండి సినిమా రంగం మీద అపారమైన ఆసక్తి. ఆసక్తి అనే దానికంటే అతనే చెప్పుకున్నట్లు పిచ్చి. ఈ పిచ్చి ఎటువంటిదంటే ‘కూకుండ నీదురా కూసింత సేపు’ వంటిది. అందుకే, దక్షిణ భారతదేశ సినిమా గురించి తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఒక గని కార్మికుడిలా తవ్వుకుంటూ పోయాడు. ఈ తవ్వకంలో ఎన్నో అనర్ఘ రత్నాలు బయటపడ్డాయి. దక్షిణాది టాకీలకు సంబంధించి ఏది మొదటిది, ఎవరు తీశారు, ఎవరు నటించారు, సాంకేతిక నిపుణులెవరు? రచయితలెవరు వగయిరా అనేకానేక విషయాలు నిర్ధారణగా తేల్చి చెప్పాడు.
తెలుగువాళ్ళు తెలుగు సినిమా రంగంలోనే కాక… మొత్తం దక్షిణ భారత సినీరంగంలో నిర్వహించిన పాత్రను జయదేవ మన ముందుపెట్టడం మనకెంతో సంతోషాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తుంది. మనం అంత సంకుచితంగా ఆలోచించవలసిన పని లేదు కాని అతను సినిమాను గురించిన మన పరిజ్ఞానాన్ని కచ్చితంగా పెంచాడనే చెప్పాలి. ఈ ప్రయత్నంలో మనం ఇప్పటి దాకా సత్యాలనుకుంటున్న విషయాలలోని సత్యమెంతో కూడా తెలియజేశాడు. అనాలోచితంగా, అప్రామాణికంగా, పుంఖానుపుంఖంగా, గతానుగతికంగా మనం నమ్ముతున్న, చెప్పుకుంటూ వస్తున్న అనేక విషయాల బండారం బట్టబయలు చేశాడు.
మనం పరంపరగా వింటూ వస్తున్న విషయాలకు భిన్నంగా ఎవరయినా చెప్తే ఒక పట్టాన నమ్మం. వాళ్ళు ఎన్ని ఆధారాలు చూపినా, నిదర్శనాలు చూపినా… ‘ఔను కాబోలు’ అని ఒక పక్క అంటూనే, మన పాత అలవాటునలాగే కొనసాగిస్తూ పోతాం, ఒక్కొక్కసారి మన తత్త్వం చూసి పరిశోధకుడు నిస్పృహ చెందుతాడు. కూడా! ఎవరేమనుకుంటేనేం, అన్ని ప్రమాణాలతో నిజనిర్ధారణ చేసేసిన తర్వాత ఇవ్వాళ కాకపోతే రేపయినా దారికి రాకపోతారా అని పరిశోధకుడు ‘విపులాచ పృథ్వీ’ అనే భవభూతి శ్లోకం గుర్తుచేసుకొని సేద తీరతాడు. తప్పదు కదా మరి!
జయదేవ ఈ పుస్తకం పీఠికలో ఒక ప్రాసంగికమైన ప్రశ్నను కూడా లేవనెత్తాడు. తెలుగు సాహిత్య చరిత్రకారులకు సినిమా సంగతి పట్టలేదేమని? ఏ విషయంలోనయినా మనం చాలావరకు అనుకర్తలమే తప్ప కొత్త తోవ లేర్పరిచేవాళ్ళం కాదు కదా! ఒకప్పుడు జానపద సాహిత్యమూ నిరాదరణకు గురయినదే. వేమన వంటి ప్రజాకవులూ లెక్కలోకి రాలేదు. క్రమంగా కొంత మార్పు వచ్చింది. నాటకం లాంటిదే సినిమా కూడా! ప్రదర్శన విషయం పక్కనపెడితే సాహిత్యం విషయంలో మన నిర్లక్ష్యం సమంజసం కాదు కదా! సినిమా సాహిత్య స్రష్టలలో పలువురు ప్రధాన స్రవంతి కవులూ, రచయితలూ కూడా! సాహిత్య చరిత్రకారులు దీన్ని పరిగణనలోకి తీసికొంటారని ఆశిద్దాం.
విశ్వవిద్యాలయ పరిశోధనలు పలచబారుతున్న ఈ రోజుల్లో… తనకు ఆసక్తి ఉన్న ఒక విషయంపై పట్టుదలతో, వ్యయప్రయాసలకు ఓర్చి జయదేవ ఇంత కృషి చేయడం అభినందనీయం.
తెలుగు వారి సినిమా చరిత్ర పరిజ్ఞానాన్ని ఈ పుస్తకం కచ్చితంగా మెరుగుపెడుతుంది. అందుకే, ఈ ప్రచురణ. రచయిత ‘పండిత పుత్రుణ్ణ’నిపించుకోనందుకు అభినందిస్తూ, మనందరికీ ఆసక్తి ఉన్న ఈ విషయం ఒక మంచి పరిశోధకుడి చేతిలో పడి ప్రకాశించినందుకు మనం కృతజ్ఞతాబద్ధులం కావాలి.
-దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి,
సంపాదకులు, ఎమెస్కో
“మన సినిమా ఫస్ట్ రీల్”
రచయిత- రెంటాల జయదేవ
ఫోన్- 94413 71357
పేజీలు- 566
వెల- రూ. 750
ప్రతులకు- ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, విజయవాడ
రేపు:-
మన సినిమా చరిత్ర-3
“జయదేవ కనుక్కున్నదేమిటి కొత్తగా?”
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు