Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మయన్మార్ లో జుంట పాలకుల ఆగడాలు పెరిగిపోయాయి. కరోన బాధితులకు వైద్యం అందకుండా క్రూరంగా  వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ వ్యతిరేకుల్ని ఇబ్బందులకు గురి చేసిన మిలిటరీ పాలకులు తాజాగా సామాన్య ప్రజల్ని కూడా తమ విధానాలతో హింసిస్తున్నారు.  దేశంలో కరోన మహమ్మారితో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మిలిటరీ ఆస్పత్రులకు కూడా బాధితులు పోటెత్తారు. మిలిటరీ ఆస్పత్రుల్లో సాధారణ ప్రజలకు వైద్యం చేయకూడదని డాక్టర్లను  ఆదేశించారు. చావు బతుకుల మధ్య వస్తున్న వారిని కాదనలేక వైద్యం చేసే డాక్టర్లను మిలిటరీ పాలకులు నిర్బంధించారు. ఇప్పుడు రాజధాని యాంగూన్ తో పాటు అనేక చోట్ల వైద్యులు జైళ్ళు, గృహ నిర్బంధంలో ఉన్నారు.

ప్రాణవాయువు (ఆక్సీజన్) కోసం పడిగాపులు, ఆస్పత్రుల్లో చేరేందుకు  క్యూ లైన్లు  మయన్మార్ లో సర్వత్ర కనిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఆక్సీజన్ అమ్మకాల్ని నిలిపివేశారు. ఆక్సీజన్ ప్లాంట్ల వద్ద సిలిండర్ల రీఫిల్లింగ్ కోసం బారులు తీరారు.  ఫేస్ బుక్, వాట్స్అప్ గ్రూపుల్లో “ ప్లీజ్ హెల్ప్, అర్జెంట్, ఎమర్జేన్సి” విజ్ఞప్తులే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి. సరైన సమయంలో వైద్యం లభించక, ఆక్సీజన్ అందక ఎక్కువ మంది చనిపోతున్నారని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.  స్మశానాల వద్దకు మృతదేహాలు వేల సంఖ్యలో చేరుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు 24 గంటలు అత్యక్రియలు చేస్తున్నారు.

వ్యాక్సిన్ మొదటగా సమకుర్చుకున్న ప్రపంచ దేశాల్లో మయన్మార్ ఒకటి. ఈ ఏడాది ఏప్రిల్ లో అంగ్ సాన్ సూకీ హయంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి మిలిటరీ పాలకులు ఏలుబడిలోకి వచ్చాక కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు.

ప్రభుత్వ వ్యతిరేకులతో పాటు సాధారణ ప్రజలను దారిలోకి తీసుకొచ్చేందుకు జుంట పాలకులు ఆహారం, వైద్యం, నిత్యావసరాలపై నియంత్రణ విధించారు. కరోన మహామ్మారినే అస్త్రంగా చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కోవిడ్ తో ఎంత మంది చనిపోయారు, కోలుకున్నవారు ఎంతమంది, వైద్య సదుపాయాలు  మేరుగుపరిచే అంశాల్ని మిలిటరీ పాలకులు పట్టించుకోవటం లేదు. కరోన పరీక్షలు చాల తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి.

కరోన జైళ్లకు నిరసనకారులు….

జైళ్లకు కూడా కరోన వ్యాపించింది. ప్రభుత్వ వ్యతిరేకులు, నిరసనకారులు, ప్రజాస్వామ్య వాదులతో పాటు డాక్టర్లు కూడా జైళ్ళలో ఉన్నారు. గృహ నిర్బంధాలకు లెక్క లేదు. కరోన తీవ్రత ఏ స్థాయిలో ఉందో వాస్తవ స్థితిగతుల్ని జుంట పాలకులు ప్రకటించటం లేదు. మహమ్మారి వ్యాప్తి ఏ విధంగా ఉందో ఎవరికీ తెలియటం లేదు. రోజుకు కేవలం ఆరు వేల కేసులు నమోదవుతున్నాయని, రెండువందల యాభై మంది కన్నా ఎక్కువ చనిపోవటం లేదని ప్రభుత్వం లెక్కలు చెపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన దానికి పది రెట్లు ప్రజలు చనిపోతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా కరోన నియంత్రణలో ఉందని జుంట ప్రభుత్వం చెపుతోంది. ఆక్సీజన్ కొరత అసలు లేదని ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇస్తున్నారు. అంతర్జాతీయ మీడియాకు ఆస్పత్రులు, గ్రామీణ మయన్మార్ సందర్శనకు అనేక షరతులు పెడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణలోని ప్రాంతాలు, మిలిటరీ పాలకులు సూచించిన ఆస్పత్రుల సందర్శనకే అనుమతిస్తున్నారు. సాధారణ ప్రజలు ఇంటర్వ్యూ ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని విచారణ లేకుండానే కరోన తీవ్రత ఉన్న జైళ్ళకు పంపుతున్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఐక్యరాజ్యసమితి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా జుంట పాలకులు పెడచెవిన పెడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల గురించి మాట్లాడే చైనా – మయన్మార్ మిలిటరీ పాలకులకు లోపాయికారిగా మద్దతు ఇస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయోజనాలు ఆశించి భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది.

కరోన మహమ్మరితో పోరాడుతున్న ప్రపంచ దేశాలు మొక్కుబడి ప్రకటనలు తప్పితే మయన్మార్ లో ప్రజాస్వామ్య పునః ప్రతిష్ఠ కోసం కృషి చేయటం లేదు.

-దేశవేని భాస్కర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com