Saturday, September 21, 2024
Homeసినిమాఅసలైన రికార్డ్ అంటే ఇదీ .. అసలైన హిట్ అంటే ఇదీ!

అసలైన రికార్డ్ అంటే ఇదీ .. అసలైన హిట్ అంటే ఇదీ!

Kashmir Files: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ ది కశ్మీర్ ఫైల్స్‘ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఈ తరం స్టార్ హీరోలు లేరు .. హీరోయిన్స్ లేరు .. సూపర్  హిట్ సాంగ్స్ లేవు .. భారీ సెట్లుగానీ .. భారీ ఫైట్లుగానీ లేవు. మరి ఈ సినిమాలో ఏవుంది? అంటే .. కథ ఉంది. ఇప్పటి కమర్షియల్ సినిమాల్లో లోపించిన వాస్తవికత ఉంది. ఏ ఫ్రేమ్ లో నుంచి చూసినా ఏదో ఒక మూల కూడా కనిపించని సహజత్వం ఉంది. తెరపై పాత్రధారులు కాకుండా పాత్రలను మాత్రమే కనిపించేలా చేసిన అద్భుతమైన ఆవిష్కరణ ఉంది. అందుకే ఇప్పుడు అంతా ఈ సినిమాను గురించి చర్చించుకుంటున్నారు.

ఇది పాన్ ఇండియా సినిమా కాదు .. ఆ స్థాయి పబ్లిసిటీ లేదు. పరుగెత్తుకుంటూ వెళ్లి చేసిన ప్రమోషన్స్ లేవు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలా చేయలేదు. అయినా ఏ వీధిలో .. ఏ థియేటర్లో ఈ సినిమా ఆడుతుందో తెలుసుకుని  వెతుక్కుంటూ మరీ వెళుతున్నారు. అంతగా ఈ సినిమాలో ఏవుంది? అంటే, 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడి ఉంది .. ఆగకుండా వారి కుటుంబాలపై సాగిన అమానుషకాండ ఉంది. మనసును కదిలించే వాస్తవాలు ఉన్నాయి .. హృదయాన్ని పెకిలించే సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

అనుపమ్ ఖేర్ .. మిథున్  చక్రవర్తి .. పల్లవి జోషి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 11వ తేదీన  630 థియేటర్స్ లో మాత్రమే విడుదల చేశారు. వారం తిరిగే సరికి ఈ సినిమా 4వేల థియేటర్లను ఆక్రమించింది. 100 కోట్లకి పైగా వసూలు చేసింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా జనంలోకి ఇంతగా దూసుకుపోయిందంటే సాధారణమైన విషయం కాదు. ప్రధాని మోదీ సైతం ఈ సినిమా చూడమని చెప్పారంటే .. వివిధ రాష్ట్రాలు  పన్ను మినహాయింపు ఇస్తున్నాయంటే ఈ సినిమా గొప్పతనమేమిటనేది అర్థం చేసుకోవచ్చు.

తేజ్ నారాయణ్ అగర్వాల్ .. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. భారీతనం ఉంటేనే .. స్టార్స్ ఉంటేనే .. భారీ పబ్లిసిటీ ఉంటేనే జనం థియేర్లకు వస్తారనే ఒక ఆలోచనా విధానాన్ని మార్చిన సినిమాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read : ‘ద కశ్మీర్ ఫైల్స్’ తెలుగులో డబ్ చేస్తాం : నిర్మాత అభిషేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్