‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటూనే ఈ సినిమా విజయాన్ని సాధించింది. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. క్రితం ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. జరిగిన సంఘటనలను సినిమా ద్వారా పూర్తి స్థాయిలో చెప్పలేకపోయానని భావించిన వివేక్ అగ్నిహోత్రి, యథార్థ సంఘటనలను వెబ్ సిరీస్ గా అందించడానికి రెడీ అవుతున్నారు.
‘ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ను ఆయన రూపొందించారు. ఆయనతో పాటు పల్లవి జోషి ప్రధానమైన పాత్రను పోషించింది. ఈనెల 11వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కి దక్కిన ఆదరణ .. ఆ సినిమా పట్ల లక్షలాది మంది చూపించిన ఆసక్తిని గుర్తుచేసుకుంటే, ఈ వెబ్ సిరీస్ పై కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాను అనుకున్న విషయాలను .. అంశాలను వివేక్ అగ్నిహోత్రి మరింత బలంగా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
“కశ్మీర్ హిందువుల మారణ హోమానికి సంబంధించిన ఎన్నో సంఘటనలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. అవి ఎంత బాధాకరమైనవనే విషయం అందరికీ తెలియాలి. ఆ చేదు నిజాన్ని అందరి ముందు ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాను. ఈ వెబ్ సిరీస్ సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించినది .. నిజాయితీతో కూడిన సహజమైన ఆవిష్కరణ. ఇది ప్రతి ఒక్కరినీ వాస్తవికతలోకి తీసుకుని వెళుతుంది” అనే అభిప్రాయాన్ని వివేక్ అగ్నిహోత్రి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.