తెరాస ప్రభుత్వం ఊదితే… ఊడిపోతుంది, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని, అలానే వ్యవహరిస్తే… నేనే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లకు వస్తానని సంజయ్ హెచ్చరించారు. నేను పోలీసులకు వ్యతిరేకిని కాను, ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగుతూ… కొంతమంది ఉన్నతపదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. నేనొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే… ముఖ్యమంత్రే అక్కడికి రావాల్సి వస్తుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. గంభీరావుపేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజ సింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పార్టీ నేతలు పాల్గొన్నారు.
గంభీరావుపేటలో బండి సంజయ్ కామెంట్స్:
తెలంగాణ రాష్ట్రంలో ‘హిందూ సమాజాన్ని’ సంఘటితం చేయాలని మోడీ, అమిత్ షా నన్ను మీ ముందుకు పంపించారు. తెలంగాణలో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సర్పంచులు ఆస్తులను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో 20 మంది సర్పంచులు రాజీనామా చేశారు. కొంత మంది సర్పంచులు మాత్రం దోచుకుంటున్నారు. పేరుకు మాత్రమే ఎంపీటీసీ…. వాళ్ళకి ఎలాంటి అధికారము లేదు.
మొన్నవర్షాలకు సిరిసిల్లలో పరిస్థితి ఏంటో మనం చూశాం. సిరిసిల్లలో బ్రిడ్జ్ కట్టించలేని మంత్రి… బిజెపిని విమర్శిస్తాడు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి ఏం చేశాడో… మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి. పైసలు కేంద్రానివి… ప్రచారం కేసిఆర్ ది.
సన్న వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించాలి. ‘వరి వేస్తే ఉరే’ అంటూ రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నాడు. పంట దిగుబడి ఎక్కువ వస్తే దానికి తగ్గ ప్రణాళిక ఏదని ప్రశ్నిస్తున్నా. పంట నష్ట పరిహారం ఎక్కడికి పోయింది? రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదు.
పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద తెలంగాణకు కేంద్రం 2.91 వేల ఇళ్లను మంజూరు చేసింది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి ‘దళిత బంధు’ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బిసి, బడుగు, బలహీన వర్గాలకు ‘దళిత బంధు’ లాంటి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నా.
తెలంగాణలో హిందువులు తమ పండుగలను జరుపుకోవాలి అంటే పర్మిషన్ తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ధర్మం కోసం మాత్రమే బండి సంజయ్ పని చేస్తాడు. ధర్మం కోసం పని చేయడంలో బండి సంజయ్ భయపడడు. 370 ఆర్టికల్ రద్దు బిల్లులో నన్ను పాల్గొనేలా చేసిన మీకు నా ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ తీసుకోలేను.
తెలంగాణలో పేదల ప్రభుత్వం రావడానికే కష్టపడుతున్నా. 2023 లో ‘గొల్లకొండ కోట’ పై కాషాయ జెండా ఎగరేస్తాం. కుటుంబ పాలన, అవినీతి పాలన, గడీల పాలన అంతం చేసేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలను హోల్ సేల్ గా సీఎం కేసీఆర్ కొనేశాడు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తోంది. అందుకే ఆర్టీసీ అప్పుల పాలైందని ప్రచారం చేస్తోంది.
ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదు… తెలంగాణ వ్యాప్తంగా బిజెపి తరఫున పోరాటం చేస్తాం.