టీకా కోసం ఇండియాపై ఒత్తిడి

అంతర్జాతీయంగా కోవిడ్ మహమ్మారి తగ్గు ముఖం పట్టక పోవటంతో అగ్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు టీకా ఒక డోసు కూడా అందని దేశాలు  ఉన్నాయి. ఆఫ్రికా, లాటిన్  అమెరికాతోపాటు ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో టీకా కోసం ఎదురు చూపులు తప్పటం లేదు. దీంతో కోవిడ్ మూడో దశ విస్తరించే ప్రమాదం ఉందని, కరోనా కట్టడి కోసం ఈ నెల 25 వ తేదిన న్యూయార్క్ లో కోవిడ్-19 ప్రపంచ దేశాల శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు.  సమావేశానికి ముందే ఇండియా టీకా ఎగుమతుల్ని పునః ప్రారంభించాలని అగ్ర రాజ్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చైనా నుంచి వివిధ రకాల వ్యాక్సిన్లు వస్తున్నా ఇండియా కంపెనీలు ఉత్పత్తి చేసినవి ప్రభావ శీలంగా ఉన్నాయని అంతర్జాతీయ సంస్థల నివేదికలు ఇప్పటికే రూడీ చేశాయి. ఇండియా వీలైనంత తొందరగా టీకా ఎగుమతులు ప్రారంభించాలని అమెరికా కోరుతోంది. ఎగుమతులకు భారత్ ఒప్పుకుంటే అంతర్జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ప్రముఖ పాత్ర కట్టబెట్టే అవకాశం ఉంది.

న్యూయార్క్ లో జరిగే ప్రపంచ దేశాల శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోర్రిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదే సుగ, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బిడెన్ తో సహా వివిధ అగ్ర రాజ్యాల అధిపతులు హాజరవుతున్నారు. అదే రోజు ఐక్యరాజ్య సమితి 76వ  సాధారణ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కరోనాతో అంతర్జాతీయ సవాళ్లు, ఆఫ్ఘన్ పరిణామాలతో ఉగ్రవాదం ముప్పు ప్రధాన అంశాలుగా మోడీ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది.

అయితే కరోనా రెండో దశ ప్రారంభంలో భారత దేశం అతలాకుతలం అయింది. మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ప్రజలకు టీకాలు ఇవ్వకుండా విదేశాలకు ఎగుమతులు చేయటం రాజకీయ దుమారం లేపింది. దీంతో వెంటనే వ్యాక్సిన్ ఎగుమతుల్ని నిలిపివేసి దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతుల గురించి ఆలోచిస్తామని ఇండియా ప్రకటించింది. ఇప్పటివరకు 79 శాతం జనాభాకు టీకా పంపిణి పూర్తి అయింది. మరో నెల రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. ఈ నెల రోజుల తర్వాతే టీకా ఎగుమతులకు అవకాశం ఇవ్వాలని వైద్య నిపుణులు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి ముందే ఎగుమతులకు ఛాన్స్ ఇస్తే మరోసారి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *