కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్ సభకు హాజరయ్యారు. గతంలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రాహుల్ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. కోర్టు తీర్పుతో రాహుల్ పై వేసిన అనర్హతను లోక్ సభ సచివాలయం ఎత్తివేసింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
ఈ ఉదయం పార్లమెంట్ కు వచ్చిన రాహుల్ ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి సభ్యులు రాహుల్ కు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్.. ట్విట్టర్ బయోలో తనను తాను డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మార్చుకున్నారు.
మరోవైపు మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు అంటే ఈనెల 10వ తేదీన మోదీ సమాధానమివ్వనున్నారు. కాగా, అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక్కరోజు ముందు రాహుల్ తన ఎంపీ సభ్యత్వం పొంది పార్లమెంట్ లో అడుగుపెట్టడం కీలకపరిణామంగా విపక్ష కూటమి సభ్యులు భావిస్తున్నారు.