Wednesday, June 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకడపకు ఆ పేరెలా వచ్చిందంటే?

కడపకు ఆ పేరెలా వచ్చిందంటే?

కడప పేరు గురించి చాలామంది అనేదేమిటంటే దేవుని కడపలో ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం తిరుమలేశుని తొలి గడప కాబట్టి గడప అనే పేరు క్రమంగా కడపగా మారింది అని. దేవుని కడప ఆలయ స్థల పురాణం ఏమని చెప్తాదో చూద్దాం:

జనమేజయుని కల – కృపాచార్యుని కోరిక: [ఆధారం: తిరుమల తొలిగడప దేవుని కడప – తితిదే ప్రచురణ 2022 https://ebooks.tirumala.org/read?id=24935&title=Devuni%20Kadapa] మహాభారతంలో అభిమన్యుడి మనవడైన జనమేజయుడు సర్పయాగం తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శివాలయాలు, విష్ణ్వాలయాలు నిర్మించుకుంటా వచ్చి తిరుమలలో నిద్రించినప్పుడు ఆ స్వామి వారే కలలోకి వచ్చి తాను చెరువుకట్ట దగ్గర ఉన్నానని చెప్పినారు. అక్కడ దొరికిన స్వామివారి ప్రతిమను వాయువ్యంగా పది ఆమడల దూరంలో (దాదాపు 130 కి.మీ.) పుష్కరిణి, హనుమంతుడు ఉన్నచోట (దేవుని కడపలో) ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని ఆదేశం వినబడింది.

ఇంకొక పక్క వాళ్ళ కులగురువైన కృపాచార్యులు కలియుగ దైవాన్ని దర్శించుకోవాలని హస్తిన నుంచి బయలుదేరి దారిలో అనేక క్షేత్రాలు, తీర్థాలు దాటుకుంటా హనుమత్ క్షేత్రమైన కడప చేరినాడు. అక్కడి నుంచి ప్రయాణం ముందుకు సాగక హనుమంతుణ్ణి సేవించుకుంటా ‘మీ దర్శన భాగ్యాన్ని కలిగించమ’ని శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాడు. అక్కడే దేవుడు ప్రత్యక్షమైనాడు. కృపాచార్యులు తన మాదిరే తిరుమలకు రాలేని వాళ్లకు వీలుగా ఇక్కడే కొలువుదీరమని కోరగా స్వామి దానికీ అంగీకరించినాడు. తర్వాత ఇక్కడ కృపాచార్యుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.

పై రెండు వృత్తాంతాలనూ కలిపి చదువుకుంటే జనమేజయుడికి తిరుమలలో దొరికిన ప్రతిమనే కృపాచార్యులు ప్రతిష్ఠించినారని అనుకోవచ్చు. అప్పటి నుంచి తిరుమలకు పోలేనివాళ్ళు ఇక్కడ దర్శించుకుంటే తిరుమలలో దర్శించిన ఫలం కలుగుతాదని, తిరుమలకు పోయే భక్తులు ముందుగా ఇక్కడ దర్శించుకుంటే ఏ ఆటంకాలూ లేకుండా తిరుమల యాత్ర పూర్తయితాదనే ఆచారం ఏర్పడింది.

అందువల్ల కృపాచార్యుల పేరు మీదుగా ఈ పట్టణానికి కృపాపురం, కృపనగరం, కృపావతి అని పేరు ఏర్పడి కృప (Kripa) అన్న పదం ఉచ్చారణ క్రిప/క్రుప -> కరిప/కరుపగా, కుడపగా, చివరికి కడపగా మారింది.

పురాణాలే కాకుండా, విదేశీ యాత్రీకుల గ్రంథాలు కూడా అదే పేరును నిర్ధారిస్తున్నాయి. క్రీ.పూ. 2వ శతాబ్దం – క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలంలో ఈజిప్టుకు చెందిన టాలెమీ (క్లాడియస్ టాలెమియస్) అనే యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాసినాడు [ఆధారం: “ANCIENT INDIA as described by PTOLEMY” https://archive.org/details/dli.pahar.1072/page/185/mode/2up]  విదేశీయుల ఉచ్చారణలో కరిప అనే పేరు కరిపెగా నమోదైందని భావించవచ్చు.

కాశీకి పోయే దక్షిణ ప్రాంత యాత్రికులకు, రామేశ్వరం పోయే ఉత్తర ప్రాంత యాత్రికులకు, తిరుమలకు కాలిబాటన పోయేవాళ్లకు కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు పోయే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు పోయేవాళ్ళు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. ఐతే కడప పట్టణానికి పేరు గడప నుంచి రాలేదు.

శ్రీశైలానికి తూర్పుద్వారం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దక్షిణ ద్వారం కడప జిల్లాలోని సిద్ధవటం, పశ్చిమ ద్వారం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అలంపురం జోగులాంబ క్షేత్రం, ఉత్తర ద్వారం అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వరం. ఈ అన్ని ఊర్లకూ విడిగా పేర్లు ఉన్నట్లే ఇక్కడ కూడా తిరుమల ఆలయానికి ఉత్తర ద్వారం ఉన్న ఊరికి కృప నుంచి వచ్చిన “కడప” అనే పేరు స్వతంత్రంగా ఉంది.

కృపాచార్యుడి పేరు మీదే ఊరున్నప్పుడు అదే మహాభారతంలో కృపాచార్యుడి కన్నా మిన్నగా, గురువంటే ఈయనే అన్నంతగా ప్రసిద్ధుడైన ద్రోణాచార్యుడి పేరు మీదుగా ఈ సువిశాల భారతదేశంలో ఊరు ఉండదా? ఉంది. అదే ఇంద్రప్రస్థ (డిల్లీ) శివార్లలోని గురుగ్రామ్ ( ఒకప్పటి గుర్ గావ్).

ప్రాచీనయుగంలో గానీ, మధ్యయుగంలో కనీసం అన్నమయ్య కాలం వరకు గానీ కడప పట్టణానికి, లేదా దేవుని కడప ఆలయానికి గడప అనే పేరు ఉండేదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. ఆ తిరుమలేశుని పరమభక్తుడైన అన్నమయ్య కూడా దేవుని కడప గురించి పాడిన కీర్తనల్లో కడపరాయడు అని పేర్కొన్నాడే తప్ప ఎక్కడా గడప అన్న పదమే వాడలేదు [ఆధారం: కడపరాయని కప్పురపు కీర్తనలు తితిదే ఆర్థిక సాయంతో ముద్రితమైన పరిశోధక గ్రంథం  https://tirumala.org/Downloads/RESERCH%20BOOKS/కడపరాయని%20కప్పురపు%20కీర్తనలు.pdf] అంటే అన్నమయ్య కాలం వరకు కూడా కడప పేరుకు, గడపకు సంబంధమే లేదు. (ఒకటి రెండు చోట్ల గడప అని కనబడేది సరళాదేశ సంధి లేదా గసడదవాదేశ సంధి ఫలితంగానే. ‘పూచెన్ గలువలు’ అని ఉన్నంత మాత్రాన కలువ అనే పదం గలువ నుంచి వచ్చిందని అంటామా?)

కడప-గడపలను ఒకదాని బదులు ఇంకొకటి వాడడానికి కారణం కడప నవాబుల కాలంలో వాడుకలోకి వచ్చిన పార్శీ భాషే కావచ్చని రాహి ఫిదాయి పేర్కొన్నాడు [ఆధారం: కడప జిల్లా సమాచార దర్శిని, విశాలాంధ్ర దినపత్రిక – 1992]. తెలుగులో థ-ధ ల మధ్య తేడా ఒక చుక్క మాత్రమే. అట్లే పర్షియన్ భాషలో క-గ ల మధ్య తేడా కనబడీ కనబడనట్టుండే ఒక సమాంతర రేఖ మాత్రమే (کا گا). ఇప్పుడు చాలా మంది తెలుగువాళ్ళు థ బదులు ధ అని రాయడం, పలకడం చేస్తున్నట్లే ఆ కాలంలో కడపను గడప అని రాయడం, పలకడం మొదలై ఉండొచ్చు. గడప అన్నప్పుడు అది ‘దేనికి గడప?’ అన్న ప్రశ్న సహజంగా వస్తాది. దానికి ‘తిరుమలకు తొలిగడప’ అన్న సమాధానం కూడా సిద్ధంగా ఉంది. ఆ ప్రశ్నకు ఈ సమాధానం కరెక్టే గానీ ఆ పేరుకు ఇదే మూలం అవడం అబద్ధం.

కడపను పోలిన ఊర్ల పేర్లు కడపాయపల్లె, కడపనాగాయపల్లె మొదలైనవి. కడప అనే పేరు గడప నుంచి వచ్చి ఉంటే ఈ ఊర్ల పేర్లు గడపాయపల్లె, గడపనాగాయపల్లె అని ఉండాల గదా? ఎందుకు లేవు? లేదూ ఇవన్నీ కొట్టిపారేసి, గడప నుంచే కడప వచ్చిందని తీర్మానించాలనుకున్నా స్థానికంగా కడప, చుట్టుపక్కల గ్రామాల్లో గుమ్మాన్ని గడప అనరు. కడప్మాను (కడపమాను), కడెప్మాను అనే అంటారు. కడపమాను అనేది ఇంటిపేరుగా కూడా ఉంది. వీటన్నిటిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఏ కాలంలోనూ వాడుకలో లేని గడప అనే పదానికి, కడప పేరుకు లేని సంబంధాన్ని కల్పించే ప్రయత్నాలు జరిగినట్టు అనిపిస్తాది.

-త్రివిక్రమ్, 99010 65406

(రచయిత  స్వస్థలం కడప సమీపంలోని పడిగెలపల్లె. ఎంసీఏ చేసి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిర పడ్డారు. ఇంటర్నెట్‌లో యూనికోడ్‌ తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషిచేసిన తొలితరం తెలుగు బ్లాగర్. 2006లో ప్రారంభమైన ‘పొద్దు’ తెలుగు వెబ్‌ మ్యాగజైన్‌ (poddu.net) వ్యవస్థాపక సంపాదకుడిగా నాలుగేండ్లు, 2016 – 2019 మధ్య ‘ఈమాట’ (eemaata.com) సహ సంపాదకుడిగా మూడేండ్లు వ్యవహరించారు. ఆన్లైన్లోనే నింపి పంపగల తెలుగు క్రాస్ వర్డ్ పజిల్స్ మొదలుపెట్టి పొద్దులోను, ఈమాటలోను అనేక క్రాస్ వర్డ్ పజిల్స్ కూర్చినారు.  వైవిధ్యమైన అంశాల గురించి kadapa.info, ఇతర వెబ్సైట్లలో రచనలు, అప్పుడప్పుడు కథలు రాస్తుంటారు)

RELATED ARTICLES

Most Popular

న్యూస్