Sunday, September 8, 2024
Homeసినిమాసావిత్రి ఒక సముద్రం

సావిత్రి ఒక సముద్రం

Savitri.. an ocean of acting :
సావిత్రి .. వెండితెరపై ఒక పున్నమి వెన్నెల. ప్రేక్షకుల హృదయాకాశంలో అందాల చందమామ. తెలుగు తెరకి నిండుదనాన్ని .. పండుగదనాన్ని తీసుకొచ్చిన అభినయ శిఖరం
. ప్రేక్షకుల మనసు మైదానాలను ఈనాటికీ స్పర్శిస్తూనే ఉన్న నవరస నట ప్రవాహం. సావిత్రి ఒక సముద్రం .. ఆ సముద్రతీరంలో కూర్చుని ఎన్నాళ్లు చూసినా .. ఎన్నేళ్లు చూసినా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి అభినయ సంపద ఒక మహాగ్రంథాలయం. ఆమె నటనకి సంబంధించిన ఎన్ని పుస్తకాలు చదివినా .. ఎన్ని పేజీలు తిరగేసినా తెలుసుకోవలసింది ఎంతో మిగిలే ఉంటుంది.

 Savitri

సావిత్రి గుంటూరు జిల్లా ‘చిర్రావూరు’లో జన్మించింది. ఆమె బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో పెదనాన్న దగ్గర పెరిగింది. చిన్నప్పటి నుంచే సావిత్రి చాలా చురుకైన పిల్ల. నాటకాల్లో తన వయసుకి తగిన పాత్రలను పోషించిన భేష్ అనిపించుకున్న అమ్మాయి. రంగు కాస్త తక్కువే అయినా, ‘ఈ పిల్ల కళ్లు ఎంత బాగున్నాయో’ అని అంతా చెప్పుకునేవారు. చిన్నప్పటి నుంచి సావిత్రికి పరిశీలనా శక్తి ఎక్కువ .. చూడగానే పట్టేసేది. అలాంటి సావిత్రికి నటన పట్ల గల ఆసక్తిని గమనించిన పెదనాన్న ఆమెను మద్రాసుకు తీసుకుని వెళ్లాడు.

సావిత్రిని అక్కడి స్టూడియోల చుట్టూ తిప్పాడు. సావిత్రికి అదొక ప్రత్యేకమైన ప్రపంచం అనిపించింది. ఏవేవో సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. ఎవరి పనుల్లో వాళ్లున్నారు. ఆ తరువాత ఇండస్ట్రీ అంతా తన చుట్టూ తిరుగుతుందని సావిత్రికే తెలియదు. స్టేజ్ పై స్వేచ్ఛగా నటించిన సావిత్రికి .. కెమెరాకి కట్టుబడి కొలతల ప్రకారం నటించడం కొత్తగా అనిపించింది. ఆ విషయం ఆమెకి పట్టుబడేసరికి కొన్ని మంచి వేషాలు పోయాయి. ‘సంసారం’ .. ‘పాతాళభైరవి’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆమె, ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సరసన తనకి అవకాశం వస్తుందా అనుకున్నారు.

‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో రెండవ కథానాయికగా అవకాశాన్ని సంపాదించుకున్న సావిత్రి, ‘దేవదాసు’ సినిమాలో ప్రధాన నాయికగా ఇండస్ట్రీనే కాదు, అశేష ప్రేక్షక లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. ఆ సినిమా నుంచి సావిత్రి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున ఏఎన్నార్ తో సావిత్రి వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. సాంఘిక ..  జానపద .. పౌరాణిక చిత్రాలలో ఎదురులేని కథానాయికగా ఆమె ఒక చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆమె తమిళంలోను బిజీ అయ్యారు.

ఏ ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తో కలిసి తెరపై కనిపిస్తే చాలని సావిత్రి అనుకున్నారో, అలాంటి వాళ్లిద్దరి సినిమాల కోసం డేట్లు సర్దుబాటు చేయడం ఆమెకి కష్టమైపోయింది. ఆమె డేట్ల కోసం వారే వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఎన్టీఆర్ తో చేసిన ‘దేవత’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’, ఏఎన్నార్ తో చేసిన ‘దేవదాసు’ .. ‘ మూగమనసులు’ .. ‘దొంగరాముడు’ సినిమాలు  సావిత్రి కెరియర్లోనే చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఇక ఇద్దరి కాంబినేషన్లో ఆమె చేసిన ‘మిస్సమ్మ’ .. ‘గుండమ్మ కథ’ .. ‘మాయా బజార్’ సినిమాలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ .. ‘పాండవవనవాసం’ .. ‘నర్తనశాల’ వంటి చిత్రరాజాలు, అసమానమైన సావిత్రి అభినయానికి ఆనవాలుగా కనిపిస్తాయి .. నిలువెత్తు నిర్వచనాల్లా నిలుస్తాయి. తెలుగు సినిమాకి సంబంధించి అటు ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలన్నా .. ఇటు ఏఎన్నార్ గురించి చెప్పుకోవాలన్నా సావిత్రితో కలిపి చెప్పుకోవలసిందే. అదే సావిత్రి ప్రత్యేకత. ఒక మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన అమ్మాయి, తెలుగు .. తమిళ సినిమాల్లో సాటిలేని మేటి హీరోయిన్ గా రాణించడమనేది అంత ఆషామాషీ విషయం కాదు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అనడటానికి సావిత్రి జీవితం ఒక పెద్ద ఉదాహరణ.

 Savitri

ఇక జెమినీ గణేశ్ తో సావిత్రి వివాహం ఆమె జీవితంలోని రెండవ భాగం. కొంతకాలం పాటు అన్యోన్యంగా సాగినవారి వైవాహిక జీవితం ఆ తరువాత కలతలా పాలైంది. ఎంతమంది సన్నిహితులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్లిద్దరి మధ్యగల అగాధాన్ని పూడ్చలేకపోయారు. వాళ్ల మధ్య ఎప్పటికప్పుడు ఎడబాటు పెరుగుతూ వెళ్లింది. చివరికి తన జీవితానికి ఆమెనే కన్నీటి ముగింపును రాసుకున్నారు. సావిత్రి గొప్పనటి మాత్రమే కాదు .. అంతకు మించి మంచి మనసున్న మనిషి. ఆమె నుంచి సహాయ సహకారాలను పొందినవాళ్లకి లెక్కేలేదు. అతి మంచితనం .. అమాయకత్వం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనడానికి ఆమె జీవితమే నిలువెత్తు నిదర్శనం. ఈ రోజున (డిసెంబర్ 6) ఆ మహానటి జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.

(సావిత్రి జయంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read :

అందాల చందమామ…జమున

RELATED ARTICLES

Most Popular

న్యూస్