కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. నాయకుల్ని సముదాయించి, గ్రూపుల్ని సంతృప్తి పరిచి మంత్రాంగం చేయటం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఇప్పుడు కన్నడ నాట కూడా అదే తతంగం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 20వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. అదే రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు కనీసం మరో 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. దీంతో మే 19న కేబినెట్ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనా.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విబేధాల కారణంగా ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో మంత్రి పదవుల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని పార్టీ పెద్దలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్ తో చర్చించి తుది జాబితా రెడీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు 24 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించలేదు. రేపు మంత్రి వర్గ విస్తరణ తర్వాత శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య శుక్రవారం భేటీ కానున్నట్టు తెలుస్తోంది.