Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసందేశం- సందేహం

సందేశం- సందేహం

Break for now: సంక్షిప్త సందేశాల వేదిక ట్విట్టర్ ను అమెరికా దిగ్గజ ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కొనడానికి ధర నిర్ణయమయ్యింది. ఇరువైపులా యాజమాన్య బోర్డులు అంగీకరించాయి. మార్పులు, చేర్పుల గురించి మస్క్ మస్తుగా మాట్లాడారు.

ట్విట్టర్ మస్క్ హస్తగతమయ్యాక భావప్రకటనకు సంబంధించిన ఈ కంపెనీలో…తమ భావ ప్రకటనకు భద్రత ఉంటుందో? ఉండదో? అని ఉద్యోగుల్లో ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ట్విట్టర్ లో కొన్ని పెద్ద తలకాయలు అప్పుడే పక్కకు తప్పుకున్నాయి. ఈలోపు ఏమి జరిగిందో? ఏమో కానీ…ట్విట్టర్ కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని స్వయంగా ఎలాన్ ప్రకటించారు.

ట్విట్టర్ లో అయిదు శాతం దాకా ఫేక్, స్పామ్ అకౌంట్లు ఉన్నాయని… వాటిని శుభ్రం చేసిన తరువాతే కొనుగోలు గురించి ఆలోచిస్తానని ఎలాన్ చెబుతున్న మాటలను అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు నమ్మడం లేదు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టినప్పటినుండి టెస్లా వ్యవహారాలు గాడి తప్పాయని, టెస్లా షేర్ విలువ కూడా పడిపోయిందని…ఈ నేపథ్యంలో ట్విట్టర్ జోలికి వెళ్లకుండా…చేతులు కాలకముందే ఎలాన్ జాగ్రత్తపడ్డారని మార్కెట్ విశ్లేషణ. ఒకేసారి మూడున్నర లక్షల కోట్లు పెట్టి ట్విట్టర్ ను కొని, ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతానని గొప్పగా ప్రకటించిన నేపథ్యంలో…ఇప్పుడు దాన్ని కొనకపోవడానికి ఎలాన్ సాకులు వెతుకుతున్నట్లు కొందరి అనుమానం.

ట్విట్టర్ లో దొంగ అకౌంట్లను మొత్తంగా డిలిట్ చేశాక ఎలాన్ కొనవచ్చు. కొనకపోవచ్చు. ఆ విషయం ఇక్కడ అనవసరం.

ట్విట్టర్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో కోట్లకు కోట్ల దొంగ అకౌంట్లు ఉన్నాయన్న విషయం ఈ సందర్భంగా చర్చకు రావడం ప్రపంచానికి మంచిది. టీ వీ రేటింగ్స్ ఒక బ్రహ్మపదార్థం. పెద్ద మాఫియా. మనదేశంలో టీ వీ రేటింగ్స్ మీద అనేక రిగ్గింగ్ ఆరోపణలు, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అలానే డిజిటల్ మీడియాలో హిట్లు, లైకులు, వ్యూస్, షేర్లు, ఫాలోయర్లు, సబ్ స్క్రిప్షన్లు…పెద్ద డిజి గజిబిజి సాలెగూడు. డిజివ్యూహం. పేరుకు కృత్రిమ మేధ అయినా…నంబర్ల మ్యాన్యుపులేషన్ చేసేదంతా మనుషులే. వాటి వెనుక ఉన్నది ఆ కంపెనీలే.

మనం చూసే విషయాన్ని బట్టి మనముందు ఆటోమేటిగ్గా అవే అవే మళ్లీ మళ్లీ కనిపించేలా అనలాగ్స్ ఉంటాయి. ఒక వ్యసనంగా మారి గంటలు గంటలు అందులోనే కూరుకుపోవడానికి వీలుగా సాఫ్ట్ వేర్, ట్యాగ్ లైన్స్, థంబ్ నెయిల్స్, సజెషన్స్ ఉంటాయి.

డిజిటల్ మీడియాలో కంటెంట్ ప్రామాణికత, నిజానిజాల కంటే ఎంతగా వైరల్ అయి…ఎన్ని లక్షల, కోట్ల మంది చూశారు? చదివారు? విన్నారు? అన్నదే పరమ ప్రామాణికం. దాన్ని బట్టే డిజిటల్ యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వల్లే ఆదాయం వస్తుంది. దాంతో విషయం కంటే ఆకర్షణకే ప్రాధాన్యం పెరిగింది. “సింగర్ సునితకు అలా జరిగిందా?” అని ఒక థంబ్ నెయిల్ ఉంటుంది. క్లిక్ చేస్తే సునితకు అలా ఏమీ జరిగి ఉండదు. నిజానికి ఆ వీడియో చేసినవాడికి సునిత గురించి ఏమీ తెలియదని… తెలిసిపోతుంది. కానీ…ఏమి జరిగిందో తెలుసుకోవాలని క్లిక్ చేయాలి. అంతే. క్లిక్ ఒక డిజిటల్ వ్యాపారం. లక్షల మంది ఇలా క్లిక్ చేస్తే…ఆ ఛానెల్ క్లిక్.

ఫేక్ అకౌంట్లు లేకుండా, నిజంగా అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామికంగా డిజిటల్ మీడియా బిజినెస్ ను నడపాలన్న సదుద్దేశంతోనే ఎలాన్ ట్విట్టర్ కొనుగోలుకు తాత్కాలిక విరామం ప్రకటించి ఉంటే మాత్రం…ఆయన్ను, ఆయన ఆదర్శాలను అభినందించి తీరాల్సిందే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

చేతులు మారనున్న ట్విట్టర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్