Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచేతులు కాలాక...

చేతులు కాలాక…

Open Secret: “చావుకు పెడితే తప్ప లంఖణానికి రారు” అని తెలుగులో గొప్ప సామెత. మామూలుగా చెబితే ఒక రోగి వినడం లేదు. తినకూడనివన్నీ తింటూనే ఉన్నాడు. నానా చెత్త తినడం ఆపితే తప్ప మందులు పని చేయవు. అప్పుడు వైద్యుడు అన్న మాట- “ఇలాగే తిని…చస్తావ్” అని. అప్పుడు రోగి దారిలోకి వచ్చి తినడం ఆపేసి బుద్దిగా ఉపవాసం ఉన్నాడు. అప్పటి నుండి పెద్ద ప్రమాదం ఏదో ఒకటి ఉంటే తప్ప చిన్నపాటి జాగ్రత్తలకు సరే అనే సందర్భాల్లో ఈ సామెతను వాడుతున్నారు.

తెలుగు సినిమాలకు ఈ సామెత ఇప్పుడు సరిగ్గా అతికినట్లు ఉంది. పాన్ ఇండియా పాన్ మసాలాల్లో సున్నం ఎక్కువై తెలుగు సినిమా నోరు పొక్కింది. ప్రపంచ వ్యాప్త విడుదలల్లో మొదటి ఆటకే తెర తెలా వెలా పోతోంది. పెద్ద సినిమాలకు మొదటి వారం పెంచుకున్న టికెట్ రేట్లు పెద్దరికం కోల్పోయి చిన్నబోయాయి. బెనిఫిట్ షోలు బెనిఫిట్ ఇవ్వకపోగా కంటెంట్ మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కలిగించాయి. మల్టిప్లెక్సుల్లో ఆహారం మల్టిపుల్ రేట్ల దెబ్బకు ప్రేక్షకులు నోరు మూసుకున్నారు. ఆ పేరు, ఈ పేరు, ప్రత్యేక అనుమతి, పెద్ద బడ్జెట్ అంటూ ప్రేక్షకుడి జేబులకు పడ్డ చిల్లులు థియేటర్లకు జనాన్ని దూరం చేశాయి. కథ, తలా తోకా లేని సినిమాలను నిర్దయగా తిరస్కరించాల్సిన ఆర్థిక అత్యయిక పరిస్థితులను సినిమాలే కల్పించాయి.

ఇప్పుడు సినిమా నిర్మాతలు కాలిన చేతులకు ఆకులు వెతుక్కుంటున్నారు. సినిమా షూటింగులు ఆపడం, నిర్మాణ వ్యయం తగ్గించుకునే మార్గాలు వెతకడం, చిన్న సినిమాలయితే నాలుగు వారాల తరువాత, పెద్ద సినిమాలయితే పది వారాల తరువాత ఓ టీ టీ లకు ఇవ్వడం, చిన్నా పెద్దా…ఏ సినిమాలకయినా ఒకే టికెట్ రేట్లు…లాంటి ప్రతిపాదనల మీద అన్నపూర్ణ ఏడెకరాల్లో రహస్యంగా ఓ టీ పి ఉన్నవారిని మాత్రమే అనుమతించి చర్చలేవో జరిపినట్లు వార్తలొచ్చాయి.

మార్కెట్లో డిమాండ్- సప్లయ్ అన్నదే మౌలికమయిన సూత్రం. సప్లయ్ ఎక్కువై డిమాండ్ లేకపోతే రేటు పడిపోవాలి. వస్తువు విలువను బట్టి ధర నిర్ణయం అని చాణక్యుడికి కొత్త పాఠాలు చెబుతూ నిర్మాతలు టికెట్లు రేట్లకు రెక్కలు తొడిగారు. పెట్టే ధరకు అందులో విలువ లేదని తెలిసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఓ టీ టీ లకు ఇన్ని వారాల పరిమితి అన్న నిబంధనలో కూడా ఏదో తర్కం లోపిస్తోంది. అసలే మునిగిన నిర్మాతకు…ఓ టీ టీ వాడు ఇచ్చే అయిదు కోట్లో, పది కోట్లో నడిసముద్రంలో నావ లాంటిది. ఎంతో కొంత బరువు తగ్గిస్తుంది. ఈ పూట ఎంగిలి మెతుకులయినా దొరికితే చాలు అన్నట్లు పరిస్థితి దీనంగా ఉంటే…నాలుగు వారాలు ఆగితే పంచ భక్ష్య పరమాన్నాలు, పది వారాలు ఆగితే హైదరాబాద్ బిర్యానీ పెడతాము అన్నట్లు ఉంది.

నిజానికి సమస్య ఏమిటో? ఎందుకో? తాము తీసిన గోతిలో తామే పడ్డవారికి తెలుసు. పడింది గోతిలో కాదని, పడ్డా ఆ గొయ్యి తమకు తామే తవ్వుకుని పడింది కాదని నిర్మాతలు ఇప్పటికీ అనుకుంటూ అయినా ఉండి ఉండాలి. లేదా మనం అలా అనుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ అయినా ఉండి ఉండాలి.

వంద కోట్ల నిర్మాణ వ్యయంలో యాభై కోట్ల రెమ్యునరేషన్, కొన్ని ఏరియాల హక్కుల సింహ భాగం తినేసి తెర పట్టనంతగా ఎదిగిన హీరో మీద ఈగ వాలనివ్వని నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టులను అదిలించి, బెదిరించి దారికి తెచ్చుకోగలరు. వారి మేనేజర్ల కమిషన్ల కక్కుర్తి మీద ఏడెకరాల్లో తనివితీరా ఏడ్చి మొహం కడుక్కోగలరు. అగ్ర హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని విన్నవించుకోగలరు.

Shooting Bandh Decision

డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అడ్వాన్సులు అంటరానివై…అత్యధిక వడ్డీలకిచ్చే ఫైనాన్సియర్ల డబ్బు నిర్మాతలకు పరమ శిరోధార్యం అయినప్పుడు నిర్మాతలకు శిరోభారం వస్తే దానికి ప్రేక్షకులు తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకోవాలా?

కథలో ఒదిగిన హీరోలు పోయి…హీరోల్లో కథ అణిగిమణిగి ఒదిగిన రోజులొచ్చినప్పుడే తెలుగు సినిమా దారి తప్పింది. ప్రేక్షకులకు ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అనుచిత ప్రాథమిక నిర్బంధ వినోదాన్ని భరించారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో తమిళ, మలయాళం మొదలు చైనా, జపాన్ ల దాకా ప్రపంచ సినిమాలను ఓ టీ టీ ల్లో చూస్తూ విశ్వ ప్రేక్షకులు అయిపోయారు. ఈ విశ్వ ప్రేక్షకుల స్థాయికి నిర్మాతలు ఎదగనయినా ఎదగాలి. లేదా వీరి జేబులకు అందుబాటులోకి వచ్చేలా దిగనయినా దిగాలి. ఈ రెండూ కాకుండా ఇంకేది చేసినా…దాన్ని తెలుగులో- “రోగమొకటయితే…వైద్యం మరోదానికి చేయడం” అంటారు.

Shooting Bandh Decision

ఈమధ్య మెగా హీరో కూడా నటుడిగా కాకుండా నిర్మాత కొణిదెలగా ఆచార్య పాఠం ఎదురు తన్నడంతో దర్శకులు చేస్తున్న తప్పులపై క్లాసులు తీసుకుంటున్నారు. తనదాకా వస్తే కానీ…తత్త్వం బోధపడదు.

వైపరీత్యాలతో ప్రకృతి తనను తాను సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. టికెట్ల వైపరీత్యాన్ని కూడా ప్రకృతి తనకు తానుగా సర్దుబాటు చేసుకుంటోంది. శంకరమంచి అమరావతి కథల్లో “వరద” అత్యద్భుతమయిన కథ. వరద ముంచెత్తినప్పుడు ఊళ్లో గొడ్డు గోదా అన్నీ కొట్టుకుపోతాయి. ఆ ఉపద్రవం దెబ్బకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చేయి చేయి కలుపుతారు. ఊళ్లో సకల మాలిన్యాన్ని వరద కడిగేసి…తనతో తీసుకుపోతుంది. వరద పొంగు తగ్గాక మళ్లీ షరా మామూలే. మనసుల్లో మాలిన్యాలను ఏ వరద కడుగుతుంది?

సినిమా టికెట్టును శాసిస్తే…సినిమాను ఓ టీ టీ శాసిస్తోంది.
తాడిని తన్నే వాడొకడుంటే…. వాడి తలను తన్నే వాడొకడుంటాడు.
ఇప్పుడు థియేటర్ల మనుగడే పెద్ద ప్రశ్నార్థకం. సినిమాల్లో చిన్న, పెద్ద ఉంటాయేమో కానీ…ప్రకృతికి చిన్న పెద్ద తేడా ఉండదు. అంతా ఒకటే.

పెను ప్రవాహానికి మహా వృక్షాలు కూకటి వేళ్లతోపాటు కొట్టుకుపోతాయి. గడ్డిపోచ వంగి మళ్లీ నిటారుగా నిలబడుతుంది. ఇప్పుడు కొట్టుకుపోయే మహా వృక్షాలకు ప్రేక్షకులు కన్నీరు కార్చరు. నిలబడే గడ్డిపోచలను అభినందించరు. అన్నిటినీ మౌనంగా చూస్తూ ఉంటారు- మౌన ప్రేక్షకులు.

ప్రకృతి చావుకు పెడితే తప్ప…సినిమాలు షూటింగులు ఆపే లంఖణానికి రాలేదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!

Also Read :

సినిమా టైటిళ్లలో సినామికల సందD!

RELATED ARTICLES

Most Popular

న్యూస్