Victory For Farmers :
సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులు బాసిన రైతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నామని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి మించి మరేదాన్ని పాలకులు ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్లేదన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నా, తెలంగాణ రైతాంగం నిరసనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి ప్రధాని మోదీకి తెలుసునని చెప్పారు. రైతుల ఉద్యమం ఉధృత రూపం దాల్చకముందే ధాన్యం కొనుగోళ్లలోనూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవిశ్రాంత పోరాటంతో రైతులు విజయం సాధించారు: మంత్రి కేటీఆర్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆ కామెంట్‌కు ఆయన విజయసూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జవాన్ అంటూ తన ట్వీట్‌లో మంత్రి కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్, టీఆర్ఎస్ విత్ ఫార్మర్స్, ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా మంత్రి తన ట్వీట్‌లో పోస్టు చేశారు.
Also Read : రైతు చట్టాలు రద్దు: మోడీ ప్రకటన