OTT Platform Vs Theatres: Which one is the future of Movies?
సినిమా తెర నాటకాన్ని మింగేసింది. సినిమా తెరను ఓ టి టి మింగేస్తోంది. మాయాబజార్ లో మాటలమాంత్రికుడు పింగళి కృష్ణుడిచేత ఒక మాట చెప్పించాడు.
“చిన్న చేపను పెద్ద చేప…
చిన్న మాయను పెద్ద మాయ…
అది స్వాహా…
ఇది స్వాహా…”
ఈ మాటలతో ఘటోత్కచుడికి తత్వం బోధపడి…నమో నమః అని కృష్ణుడి కాళ్ల మీద పడతాడు.
కనీసం 1980 ల వరకు ఏదో ఒక రూపంలో నాటకం బతకగలిగింది. సినిమా ఉధృతిలో నాటకం తెర వెనక్కు వెళ్లింది. టీ వీ లు విజృంభించాక నాటకం ఆత్మహత్య చేసుకుంది. జగన్నాటకంలో ఎవరి నాటకం వారిది కావడంతో విడిగా నాటకాలకు ఉనికి అవసరం లేకపోయింది. ఉప్పాడ పట్టు చీరల అత్తలు బెనారస్ పట్టు చీరల కోడళ్లను సాధించే కోటి ఎపిసోడ్ల కథలు ఎప్పటికీ కంచికి చేరి మంచి పట్టు కట్టుకోలేని టీ వీ సర్రియల్ నాటకాల ముందు అసలు నాటకం ఆత్మహత్య సహేతుకమైనదే.
సినిమాకు మనుగడ ఉంటుంది కానీ…సినిమా థియేటర్లు మాత్రం అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇప్పటికే వందల థియేటర్లు కనుమరుగై షాపింగ్ కాంప్లెక్స్ లు, ఫంక్షన్ హాళ్లు అయ్యాయి. నలభై ఏళ్ల కిందట రెండు రూపాయల సినిమా టికెట్ ఇప్పుడు అయిదు వందలు అయ్యింది.
సినిమా కథ పాతాళం అంచులు చూస్తూ ఉన్నా…టికెట్ ధర ఆకాశం అంచులను వెతుకుతూ ఉంటుంది. మల్టీప్లెక్స్ మాయాజాలంలో మనం వెళ్లేది సినిమాకే అయినా…సినిమా తప్ప మిగతా క్షవరం పద్ధతిగా జరుగుతుంది. అదే హోటల్, అదే గేమింగ్ జోన్, అదే షాపింగ్, అదే అవుటింగ్, అదే కాఫీ షాప్, అదే లవర్స్ మీటింగ్ పాయింట్, అదే మానవుడు చేరుకోవాల్సిన క్షేత్రం.
పార్కింగ్ బాదుడు. పాప్ కార్న్ బాదుడు…చివర వెంటపడి లాఠీ గాయక్ కెవ్వు కేకలతో బుర్ర రామ్ కీర్తన పాడించి రక్తం కారని గాయాలు చేసే అనుచిత ప్రాథమిక సంకల్పిత నిర్బంధ సినిమా వీక్షణ దుర్నిరీక్షణ శిక్ష.
ఈ థియేటర్ల హింసకు విరుగుడు లేదా? అని యావత్ ప్రేక్షకలోకం దీనంగా కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉండేది. అలా ప్రేక్షకుల ప్రార్థనలు ఫలించి ఓ టి టి పుట్టింది.
థియేటర్ కు వెళ్లడం ఒకప్పుడు జాతర. ఉత్సాహం. కేరింత. పులకింత. తపన. టైమ్ పాస్. వినోదం. ఆనందం. ఆటవిడుపు.
ఇప్పుడు పాతర. నిరుత్సాహం. బాధ. జేబుకు చిల్లు. వేదన. టైమ్ వేస్ట్. క్యూల్లో నిలుచోవడం అవమానం. తలపోటు.
ప్రకృతి చాలా విచిత్రమయినది. అది తనను తాను సహజంగా సరిదిద్దుకుంటూ ఉంటుంది. నలుగురు సభ్యులున్న కుటుంబం ఇదివరకు సినిమాకు వెళితే బాల్కనీలో రాజాధిరాజులుగా కూర్చున్నా వంద రూపాయలు అయ్యేది. ఇప్పుడు తక్కువలో తక్కువ రెండు వేలు ఉంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లాలి. లేదంటే నోరు మూసుకుని ఇంట్లో ఉండాలి. హీరోకు యాభై కోట్లు, దర్శకుడికి పాతిక కోట్లు, నిర్మాతకు చేతికి చిప్ప ఎలా వస్తాయి మరి? గతజన్మల మన పాపం ఈ జన్మలో ఇలా సినిమా టికెట్ల ద్వారా వ్యయమై బహుశా మనం పునీతులమవుతామేమో!థియేటర్ల టికెట్ల రేట్లు నేలకు దిగితే ఇప్పటికీ థియేటర్లలోనే సినిమాలు చూడాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. ప్రకృతి సహజన్యాయ సూత్రాలను థియేటర్ల యజమానులు విస్మరించినా…ప్రకృతి మరచిపోలేదు. న్యాచురల్ కరెక్షన్ ఓ టి టి ల రూపంలో జరిగింది. ఇంట్లో సోఫాలో దర్జాగా కూర్చుని, మంచం మీద పడుకుని నెట్ ఫ్లిక్స్ లు, అమెజాన్ లు, ఆహా ఓహోలు చూడగలుగుతున్నప్పుడు వేలకు వేలు తగలేసి థియేటర్లకు ఎందుకు వెళతారు?
The Rise Of OTT Platforms in India
ఇంట్లో గొడవలతో మనశ్శాంతి కోసం థియేటర్లకు వెళ్లాలనుకునేవారికి ఇప్పటి థియేటర్లు మరింత మానసిక ఆందోళన కలిగిస్తాయి. ముసలివారు టీ వీ ల్లో, పడుచువారు ఐ ప్యాడ్లలో, పిల్లలు సెల్ ఫోన్లలో ఇంటిల్లిపాది చక్కగా బుద్ధిగా ఇళ్లల్లోనే మలయాళ, అరవ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, పైశాచి, ఆఫ్ఘని, కొరియా దునియా భాషల సినిమాలను ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఒక యజ్ఞంలా అహో రాత్రాలు చూస్తున్నారు. ఇంకో వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా ఓ టి టి లో చూడడానికి సమయం సరిపోనంత కంటెంట్ ఉంది.
పోను పోను…థియేటర్లకు వెళ్లేవారిని మొదట అమాయకులుగా చూస్తారు. తరువాత అనాగరికులుగా చూస్తారు. మరో పాతికేళ్లకు ఈ ఓ టి టి లను మింగేసే ఇంకేదో టి టి రాకమానదు.
నాటకం వాళ్లు సినిమాలకొస్తే నాటకం తెరమరుగు అయ్యింది. సినిమావాళ్లు ఓ టీ టీ లోకి వస్తే అదే జరుగుతుంది. ఒక్కొక్క మీడియాకు కొన్ని పరిమితులు, కొన్ని అనుకూలతలు ఉంటాయి. తెలుగులో ఆ వైవిధ్యానికి అవకాశమివ్వకుండా ఓ టీ టీ లను సినిమావారే అల్లుకుపోయారు. ఇప్పటికిప్పుడు సినిమావారి ఆధిపత్యం తెలుగు ఓ టీ టీ ల మీద కనపడుతున్నా…ఓ టీ టీ కోరుకునే కథలు, కథనాల మీద దృష్టి పెట్టకపోతే…తనను తాను ఎలా కరెక్ట్ చేసుకోవాలో ప్రకృతికి ఒకరు నేర్పించాల్సిన పని లేదు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: