Tuesday, January 21, 2025
HomeTrending NewsChild Marriages: బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కేసులు - మంత్రి ఎర్రబెల్లి

Child Marriages: బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కేసులు – మంత్రి ఎర్రబెల్లి

బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు తన దృష్టికి వచ్చినట్లయితే నేనే కేసులు పెట్టిస్తానని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మంగళవారం హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ సర్పంచులకు బాలల పరిరక్షణ కమిటీ విధి విధానాలు అంశంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ చిన్న చిన్న సాకులతో , ఆర్థిక లేమి కారణంతో ముక్కు పచ్చలారని పిల్లలకు పెళ్లిల్లు చేసి వారి భవిష్యత్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన, బాల్య వివాహాలను జరిపినా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సంబంధిత బాల్య వివాహ నిరోధక అధికారులకు సూచించారు.

గ్రామస్థాయిలో రక్షణ సంరక్షణ అవసరమున్న పిల్లలను గుర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం కమిటీలు కృషి చేయాలని, బాలల హక్కుల పరిరక్షణలో కమిటీలు క్రియాశీలకంగా, పారదర్శకంగా పనిచేయాలని అప్పుడే బాలల రక్షణ సంరక్షణ సాధ్యపడుతుందని హితవు పలికారు. పిల్లలు సామాజిక మాధ్యమాల ప్రభావాలకు లోను కాకుండా ప్రతి తల్లి తండ్రి జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబ వ్యవస్థ ప్రధానమని ఆశించిన మార్పు రావాలంటే అది కుటుంబం నుండే రావాలన్నారు. మండల పట్టణ జిల్లా స్థాయిలలో బాలల పరిరక్షణ కమిటీల పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ కృషిచేసి బాలల స్నేహపూర్వక జిల్లాగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ కే శోభారాణి మాట్లాడుతూ బాలల హక్కుల కమిషన్ బాలల హక్కుల పరిరక్షణ దేయంగా పనిచేస్తూ  జిల్లాలోని బాలల సంక్షేమ సమితి బాలల పరిరక్షణ విభాగం వారితో సమన్వయం చేస్తూ సమస్యలు ఉత్పన్నమైన చోట అక్కడ కమిషన్ బెంచ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలి కాలంలో హనుమకొండ జిల్లాలో బాల అదాలత్ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచామని అన్నారు.
అనంతరం బాల హక్కుల పరిరక్షణ కర దీపికలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ లు జి సంధ్యారాణి, అశ్విని తానాజీ వాకడే, డిఆర్డిఓలు ఆకవరం శ్రీనివాస కుమార్, సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి
వి జగదీశ్వర్,ఆర్జేడీ బి ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు ఎం సబిత, ఎం శారద, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ లు అన్నమనేని అనిల్ చందర్ రావు, కే వసుధ, హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన సీడీపీఓలు, సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు చైల్డ్ లైన్ ప్రతినిధులు, వరంగల్ హనుమకొండ జిల్లాలకు చెందిన సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్