Saturday, January 18, 2025
HomeTrending Newsఆరో విడతలో బిజెపి - కూటమి మధ్య ప్రత్యక్ష పోరు

ఆరో విడతలో బిజెపి – కూటమి మధ్య ప్రత్యక్ష పోరు

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు  25న (శనివారం) ఈ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు, హర్యానాలోని మొత్తం పది, ఉత్తరప్రదేశ్‌లోని పద్నాలుగు సీట్లు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది సీట్లు, ఒడిశాలో ఆరు సీట్లు, జార్ఖండ్‌లోని నాలుగు సీట్లు, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమి – బిజెపి మధ్య ప్రత్యక్ష పోరు జరిగే ఆరో దశలో రెండు కూటముల నేతలు ఆరోపణలు – ప్రత్యారోపణలతో ప్రచారం హోరెత్తించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీలో మూడో దశ నుంచి 6వ దశకు వాయిదా పడింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ 25న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ మాజీ సిఎం, పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ ఇక్కడ బరిలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, పూల్పూర్, అలహాబాద్, అంబేద్కర్‌నగర్, శ్రావస్తి, దుమారియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచిలీషహర్, భదోహి నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వీటిలో లాల్‌గంజ్, మచిలీషహర్ ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లోని గిరిజన బెల్ట్‌లో ఆరో దశ జరగనుండగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సంతాల్‌లు ప్రధానంగా బంకురా, పురూలియా, పశ్చిమ్ (పశ్చిమ) మేదినీపూర్ జిల్లాల్లో నివసిస్తున్నారు. ముండా తెగ పురూలియా, పశ్చిమ్ మెదినీపూర్‌లోని కొండ ప్రాంతాలలో నివసిస్తుండగా, ఒరాన్ లేదా కురుఖ్ తెగ పురూలియా జిల్లాలోని మైదానాలలో ఉంది. తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌లలో ఓటింగ్ జరుగుతుంది.

ఢిల్లీలో బిజెపి- ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే ఓటరు కమలం వైపు మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయని, మద్యం కుంభకోణం ప్రభావం చూపుతుందని బిజెపి నేతల అంచనా. మరోవైపు కేజ్రివాల్ అరెస్టుతో బిజెపి నష్టపోతుందని కూటమి నేతలు భరోసాతో ఉన్నారు.

హర్యానాలో బిజెపి కొంత నష్టం జరగవచ్చని విశ్లేషణలు జరుగుతున్నాయి. మొత్తం పది సీట్లకు వోటింగ్ జరగనుండగా రైతుల ఆందోళనలు, కుస్తీ క్రీడాకారుల నిరసనలు పోలింగ్ పై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో ఇండియా కూటమి నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దుసుకేల్తున్నారు. సిఎం నితీష్ కుమార్ వల్లే ఈ దఫా బిజెపి ఓటమి చవి చూస్తుందని కూటమి నేతలు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్