The Talibans Efforts For Government Recognition :
ప్రపంచ దేశాల గుర్తింపు లేకపోవడంతో తాలిబన్లకు కష్టాలు పెరుగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. దేశంలో ద్రవ్యోల్భణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. అత్యవసర మందుల కొరత తీవ్రం కావటంతో చిన్నారులకు టీకాలు అందటం లేదు. శస్త్ర చికిత్సలకు ఔషధాలు అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా వేయటంతో అనేకమంది రోగుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తాలిబన్లు దేశంలో పరిస్థితులు అంతా సజావుగా ఉన్నాయని చెపుతున్నా క్షేత్రస్థాయిలో దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇటీవల ఆఫ్ఘన్లో పర్యటించిన అమెరికన్ జర్నలిస్టులు అంటున్నారు.
చైనా, పాకిస్థాన్. రష్యా దేశాలు తాలిబాన్ల వెన్నంటి ఉన్నా వారి అవసరాలు తీర్చుకోవటం తప్పితే ఆఫ్ఘన్ లకు మేలు చేసే చర్యలు లేవని తాలిబన్లకు ఇప్పుడు అవగతం అవుతోంది. ఇప్పటివరకు కేవలం పాకిస్థాన్ లో మాత్రమె తాలిబన్లకు చెందిన రాయబార కార్యాలయం ఉంది. ఇస్లామాబాద్ లో దౌత్య కార్యాలయం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న మిగతా దేశాల నుంచి తాలిబన్లకు పిలుపు రాలేదు. మరోవైపు దేశంలో ఆర్థిక,రాజకీయ పరిణామాలు వ్యతిరేకంగా మారుతున్నాయి. దీంతో చైనా కూడా అధికారికంగా తాలిబాన్లను గుర్తించాలని ఆఫ్ఘన్ సాంస్కృతిక,సమాచార మంత్రి, తాలిబాన్ల ప్రతినిధి జబిఉల్లహ్ ముజాహిద్ కోరారు. తాలిబన్లు అధికారంలోకి రావటంలో సహకరించిన చైనా కొత్త ప్రభుత్వాన్ని గుర్తించి ఆఫ్ఘన్ అభివృద్దికి తోడ్పడాలని, చైనా పెట్టుబడులకు రక్షణగా తమ ప్రభుత్వం ఉంటుందని ముజాహిద్ వెల్లడించారు.
మహిళలు, మానవహక్కులకు తాలిబాన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని, ఉగ్రవాద మూకల షెల్టర్ గా ఆఫ్ఘన్ భూభాగం వాడుకోనీయమని ముజాహిద్ స్పష్టం చేశారు. అయితే గతంలో కూడా ఇవే వల్లెవేసిన తాలిబన్లు ఆ తర్వాత తమ నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. దీంతో ఖచ్చితమైన చర్యలు చేపట్టిన తర్వాతే సంప్రదింపులు అని యూరోప్ దేశాలు తెగేసి చెప్పాయి. ముందుగా దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ, మైనారిటీల భద్రతకు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అవి అమలులోకి వచ్చినపుడే తాలిబన్లతో చర్చలు జరగుతాయని అమెరికా, ఈయు దేశాలు ఖరాఖండీగా ప్రకటించాయి.
Also Read : తాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు