Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగడియారాల మనిషి

గడియారాల మనిషి

A timeless passion for vintage clocks 

ఆయనను అందరూ చెప్పుకునే మాట “గడియారాల మనిషి” అని. అవును ఆయన గడియారాల మనిషే. ఆయన అసలు పేరు రాబర్ట్ కెనడీ. మూడు దశాబ్దాలలో దాదాపు యాభై లక్షల రూపాయలు గడియారాలకోసం ఖర్చుపెట్టారు. ముఖ్యంగా చెత్త సేకరించే దుకాణలకు వెళ్ళి పాత గోడ గడియారాలు, చేతికికట్టుకునే వాచీలు కొనుక్కొచ్చి వాటిని తన దగ్గరున్న సహాయకులతో అవి పని చేసేటట్లు చేసి ప్రదర్శనకు ఉంచడం ఆయన అలవాటు.

చెన్నైలో ఉంటున్న ఆయన దగ్గర దాదాపు రెండున్నర వేల గోడగడియారాలు, వాచీలు, అలారం గడియారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విదేశాలకు చెందినికూడా. ప్రతి గడియారం వెనుకా ఓ కథ ఉంటుంది. ఆయన సేకరణలో అత్యంత పురాతనమైన ఓ గడియారం 286 ఏళ్ళ నాటిది. ఓ ఇంగ్లీష్ అతను చేత్తో తయారు చేసిన గడియారమూ ఆయన సేకరణలో ఉంది జర్మనీలో తయారైన గడియారమూ ఉంది. దీనికి ఏడాదిలో ఒకసారి టైమ్ సెట్ చేసి “కీ” ఇస్తే చాలు. ఏ మాత్రం మరమ్మతు అవసరం లేకుండా ఇది పని చేస్తుందట.తన దగ్గరున్న గడియారాలలో చాలా భాగం ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి కావంటారు రాబర్ట్! చెత్త సేకరించి రీసైక్లింగ్ కోసం అమ్మే దుకాణాలకు వెళ్తున్నప్పుడు అక్కడ పాడైపోయిన గడియారాలు కనిపిస్తే వాటిని కొనుక్కొచ్చి పని చేసేలా చేసి తన ఇంట గోడన ప్రదర్శనకుంచడంలోని ఆనందం మాటల్లో చెప్పలేనంటారాయన!

తన కుటుంబం నుంచి తగినంత సహాయసహకారాలు లేకున్నా పాత గడియారాలను వాచీలను సేకరించడంలో తాను వెనకడుగు వేయలేదంటారు. పాత గడియారాలను కొనుక్కుని ఆయన ఇంటికి వెళ్తుంటే చాలా మంది ఓ పిచ్చివాడని అనుకునేవారట. కానీ ఇప్పుడు చాలా మంది ఈ పాత గడియారాలను చూడటంకోసం తనదగ్గరకు వస్తుంటారన్నారాయన.

తన దగ్గరున్న ఏ గడియారాన్నీ అమ్మబోనని, కానీ అవి సక్రమంగా పని చేయడానికి డబ్బులు ఖర్చుపెట్టడానికి ఆలోచించనని రాబర్ట్ చెప్పారు. తన దగ్గరున్న గడియారాలకు కీ ఇచ్చి పని చేసేలా ఓ క్రమంలో పెట్టడానికి ఆయనకు రోజుకి నాలుగు గంటలు పడుతుందట.

ఇప్పుడీ గడియారాలతో ఓ మ్యూజోయం ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆలోచన. ఆశయం. అలాగే పాత గడియారాల సేకరణ మనిషిగా గిన్నిస్ పుస్తకంలో తన పేరు నమోదు కావాలన్నదీ ఆయన ఆశ. ఆయన తన పదహారో ఏట ఈ పాత గడియారాలు సేకరించడం మొదలు పెట్టారు. ఆయన చెన్నై నగరంలో కోడంబాక్కంలోని రాయల్ టచ్ అపార్ట్ మెంట్ లో నాలుగో అంతస్తులో ఉంటున్నారు. ఆయన సేకరణలో ఇంగ్లండ్, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, స్వీడన్, హంగేరీ, జపాన్, ఇటలీ‌, రష్యా తదితర దేశాలకు చెందిన గడియారాలున్నాయి. వాటిలో చాలా వరకూ 150 ఏళ్ళ క్రితంనాటివే. తన తాతగారికి ఓ ఇంగ్లీష్ అతను 1932లో ఓ అమెరికన్ పెండ్యులం గడియారం కానుకగా ఇచ్చారు. దాని పేరు అన్సోనియా. అది చూస్తుంటే తనకెంత ఆనందమో చెప్పలేనంటారు.

మొదట్లో ఆయన దగ్గర మూడే మూడు గడియారాలుండేవి. 1993 నాటికి 34 రకాల గడియారాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు పాత గడియారాలు కొనడానికి డబ్బులు తక్కువపడితే ఆయన తన కుమార్తె స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులు ఇంట్లో వాళ్ళకు తెలీకుండా తీసుకుని ఖర్చుపెట్టేసేవారట. మొదట్లో ఆయన ఓ కంప్యూటర్ సంస్థలో పని చేసేవారు. కొంతకాలం తర్వాత ఆయన ఉద్యోగం మానేసి ఆయనే సొంతంగా కంప్యూటర్లు అమ్మడం మొదలుపెట్టారు.

గడియారాల సేకరణలో ఆయన పేరు రికార్డు పుస్తకంలో నమోదవాలని ఆశిద్దాం.

-యామిజాల జగదీశ్

Read More: కలవారి చేతిలో విలువయిన కాలం

Read More: గోడలు చెప్పే పాఠాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్