Sunday, June 28, 2026
HomeTrending Newsమూడో ముప్పు ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధమే

మూడో ముప్పు ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధమే

కరోనా వైరస్‌ మూడో ముప్పు వస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదివరకు వచ్చిన రెండు వేవ్‌ల నుంచి రాష్ట్రాలు సరైన పాఠాలు నేర్చుకున్నాయని అన్నారు. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా కరోనా మహమ్మారి కంటే ముందున్న పరిస్థితులు వస్తాయని రాజీవ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వైరస్‌ మూడో ముప్పుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా.. సెకండ్‌ వేవ్‌, అంతకుముందుతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై థర్డ్‌వేవ్‌ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని నా అంచనా’ అని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వైరస్‌ విజృంభణను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో పాటు ఇంతకుముందు వచ్చిన వేవ్‌ల నుంచి రాష్ట్రాలు పాఠాలు నేర్చుకున్నాయన్నారు.

దేశంలో మూడో ముప్పు రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తే.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 1500 ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధమవుతునట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యే వెల్లడించారు. వాటిని దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల పడకలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తే అలాంటి పరిస్థితుల్లో ‘కొవిడ్‌ వారియర్ల’ను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం 26రాష్ట్రాల్లో దాదాపు 111 కేంద్రాల ద్వారా దాదాపు లక్ష మందికి శిక్షణ అందిస్తోంది.

ఇదిలాఉంటే, దేశంలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జులై 5వ తేదీన 34వేలకు తగ్గిన కేసుల సంఖ్య ఆ తర్వాత క్రమంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజుల నుంచి వరుసగా నిత్యం 40వేల పైచిలుకు కేసులు నమోదుకావడం మూడో ముప్పునకు సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం (ఆర్‌నాట్‌) పెరగడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular