Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యే వికాసానికి మార్గం - మంత్రి సత్యవతి రాథోడ్

విద్యే వికాసానికి మార్గం – మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాకముందు 200 పైగా ఉంటే ఇపుడు 978 గురుకులాలు వచ్చాయని, దీనివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురుకులాలు గతంలో స్కూల్స్ వరకే ఉంటే ఇంటర్, డిగ్రీ వరకు పెంచామన్నారు. దేశంలో ఎక్కడా గురుకుల డిగ్రీ కాలేజీలు లేవన్నారు. విద్య అనంతరం ఉపాధి కల్పించే కోర్సులు ఉండాలని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ లా కాలేజీ, సైనిక్ స్కూల్ తెచ్చుకున్నాం. మనకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రంలో కూడా సైనిక్ స్కూల్  లేదు. గిరిజన బిడ్డలు కేవలం సైనికులే కాదు సైనిక అధికారులు కావాలని ఇది తెచ్చామన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, కొనరావు పేట మండలం, మర్రిమడ్ల గ్రామంలో బాల, బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 6.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అదనపు వసతుల కల్పన పనులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారితో కలిసి నేడు శంకుస్థాపన చేశారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నాం. ఇందుకోసం ప్రతిరోజూ గుడ్డు, వారానికి 6 సార్లు చికెన్, మటన్ ఇస్తున్నాం. సీఎం కేసిఆర్ మనవడు, మనుమరాలు తినే సన్నబియ్యం ఇక్కడకూడా మన బిడ్డలకు పెడుతున్నామన్నారు. పాఠశాలలు మళ్ళీ ప్రారంభం అవుతున్న సందర్బంగా పిల్లలకు ఇచ్చే అన్ని వసతులు కల్పిస్తున్నాం. స్థానికులు కూడా పర్యవేక్షించాలన్నారు. విద్యకు పెట్టే పెట్టుబడిని ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలకు పెట్టే పెట్టుబడిగా భావించాలి. సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో నేడు తెలంగాణలోని గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

6.05 కోట్ల రూపాయలతో డార్మెట్రి బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్, హెల్త్ క్లినిక్, పేరెంట్స్ వెయిటింగ్ హాల్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్య వసతులు, అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపన వేసుకోవడం సంతోషకరమని, దీనివల్ల ఇక్కడ అన్ని రకాల వసతులు సమకూరుతాయని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు కలిసి ఉంటున్నాయన్నారు. విద్యే వికాసానికి మార్గం. ప్రైవేటు స్కూల్స్ లలో చాలామంది పేదలు చదవలేక బడి మధ్యలో మానేస్తున్నారని, వీరందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున గురుకులాలు తెచ్చారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, గిరిజన గురుకుల సంస్థ అధికారులు విజయలక్ష్మి,  జ్యోతి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్