Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Space Hotel: ఆకాశం, గగనం, శూన్యం- అని సంస్కృత ప్రామాణిక నిఘంటువు అమరకోశం ఆకాశాన్ని ఆకాశానికెత్తుతూ ఎన్నెన్నో పదాలతో హారతి పట్టింది. నిజమే. రామ- రావణ యుద్ధాన్ని దేనితో పోల్చాలో తెలియక- అంతటి ఆదికవి వాల్మీకి- ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి సముద్రమే పోలిక. రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక అన్నాడు. అందరికీ, అన్నిటికీ అవకాశం కల్పించేదే ఆకాశం. గ్రహాలు కూడా ఆకాశంలో స్థిర కక్ష్యల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా బుద్ధిగా తిరగడానికి అవకాశం కల్పించినది ఆకాశం. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ చెప్పిన E=mc^2 మాస్ ఎనర్జీ ఈక్వలైన్స్ ఫార్ములాకు అవకాశం కల్పించినది కూడా ఆకాశమే. ఆకాశమంతా శూన్యంగా కనిపిస్తున్నా- ఆ శూన్యంలో శక్తి ఉంది. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది భౌతికశాస్త్ర పాఠం కాదు.

Space Hotel

మనం నిలబడిన భూగోళం, మన కంటికి కనిపించే సూర్య చంద్రులు ఇతర గ్రహాల గురించే ఖగోళ శాస్త్రం మాట్లాడుతుంది. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయంటుంది వేద విజ్ఞానం. ఒక సూర్యుడు కాదు- అనేక సూర్య మండలాలు అంటుంది. విరాట్ పురుషుడు ఎక్కడిదాకా విస్తరించాడు అంటే ఆకాశంలో ఎంతెత్తుకు వెళ్లినా, ఇంకా ఇంకా విస్తరించి ఉంటాడట.

“రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్”

వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండాలన్నీ నిండిపోయినపుడు భాగవతంలో పోతన చెప్పిన పద్యమిది. త్రివిక్రముడికి సూర్యుడు మొదట గొడుగుగా కనిపించినవాడు- ఆయన పైపైకి ఎదిగేకొద్దీ నుదుటి బొట్టుగా, చెవిపోగుగా, మెడ హారంలో కొలికిపూసగా, భుజకీర్తిగా, నడుముకు ఆభరణంగా, కాలి మంజీరంగా, చివరికి ఆయన పాదానికి పీఠంగా మారిపోయాడట. అంతటి సూర్యుడిని కాలికింద పీటగా చేసుకుని విశ్వమంతా ఎదిగి నిలిచిన పద్యమిది. కారణజన్ముడు మన పోతన మాత్రమే రాయగల పద్యమిది. బ్రహ్మాండాలు దాటి తెలుగు పద్యం విస్తృతి, అనంత తత్వాన్ని నాలుగు పాదాల్లో నాలుగు యుగాలకు నిలిపిన పద్యమిది. మన ఆచారం ప్రకారం భూమ్యాకాశాలు పూజింపదగినవి.

మనుచరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు పసరు ఇవ్వగానే కాలికి పూసుకుని రివ్వున ఎగిరిపోయాడు. యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు ఆకాశమార్గంలో నిరంతరం తిరగగలరు. నారదుడు రోజూ ముల్లోకాలను చుట్టి రాగలడు. ఆయన్ను పాస్ పోర్ట్, వీసా, స్టాంపింగ్ అడిగే దేవదానవులు ఇప్పటిదాకా పుట్టలేదు. ఇక పుట్టరు.

ఆకాశంలో తేలుతూ, ఊగుతూ, సాగిపోవాలన్న కోరిక ఈనాటిది కాదు. ఆకాశంలో ఒక హోటల్ కట్టి, ఆ హోటల్ ను అంతరిక్షంలో తిప్పుతూ ఉంటామని అమెరికాకు చెందిన ఒక కంపెనీ ప్రకటించింది. 2027 నాటికి అందుబాటులోకి వచ్చే ఈ అంతరిక్ష హోటల్ జెయింట్ వీల్ ను పోలి ఉంటుంది. ఒకసారి నాలుగు వందల మంది బస చేయడానికి గాజు గదులు ఉంటాయి. రూమ్ లో కిటికీ కర్టెన్ తీయగానే చంద్రుడితో బాతాఖానీ పెట్టుకోవచ్చు. నక్షత్రాలకు నీళ్లు పోయవచ్చు. సూర్యుడి నోట్లో థర్మా మీటర్ పెట్టి వేడి ఎంత ఉందో చూడవచ్చు. సూర్యుడిని మింగడానికి రాహువు వస్తే మనం కిటికిలోనుండి చెయ్ అడ్డు పెట్టవచ్చు. చచ్చి స్వర్గానికో, నరకానికో వెళ్లే వారితో కులాసాగా మాట్లాడుకోవచ్చు. పిజ్జాలో, బ్లడీ బర్గర్లో పిండాలుగా వారి చేత పితృ దేవతలకు డైరెక్ట్ గా పంపవచ్చు. ఇంకా పైపైనే ఎన్నెన్నో అడ్వాంటేజ్ లు పిండుకోవచ్చు. భూమి మీదికి దిగడం ఇష్టం లేకపోతే- పై నుండి పైకే పోవచ్చు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

స్టార్ హోటళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com