Saturday, January 18, 2025
HomeTrending Newsయుద్ధానికి మేమూ సిద్ధం: గుడివాడ ప్రతి సవాల్

యుద్ధానికి మేమూ సిద్ధం: గుడివాడ ప్రతి సవాల్

రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే చెప్పులు వేసుకుంటున్నావా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చెప్పుతో కొట్టడం అంటే గాజువాకలో ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు అని, భీమవరంలో పవన్ కు జరిగింది పళ్ళు రాలగొట్టడం లాంటిదని వ్యాఖ్యానించారు.  రేపటి నుంచి సరికొత్త రాజకీయం చూస్తారని పవన్ నేడు చెప్పారని, కానీ ఈరోజే వారి రాజకీయం మొదలైందని, కనీసం ఒక్కరోజు కూడా ఆగలేకపోయారని ఎద్దేవా చేశారు. బహుశా పవన్ ను మూడో భార్య కూడా వదిలేసి ఉంటుందని అందుకే ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నా  రేమోనని సందేహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ మీడియాతో మాట్లాడారు.

ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే వారి మీటింగ్ జరిగిందని కానీ.. ఇక్కడ ఉన్నారని తెలిసి పవన్ ను కలిసేందుకు వచ్చానని చంద్రబాబు ఎంత బాగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ముసుగులో, చీకటిలో కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ బయటకు వచ్చారని,  అక్రమ సంబంధాన్ని ముగింపు పలికి కొత్త బంధానికి తెర తీశారని వ్యాఖ్యానించారు.

కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కు లేదని, అది కాపుల జనసేన కాదని, కమ్మ జనసేన అని.. దీనికి దర్శకత్వం నాదెండ్ల మనోహర్ అని, నిర్మాత బాబు ఈరోజు సీన్ లోకి వచ్చారని మంత్రి అమర్నాథ్ దుయ్యబట్టారు. అసలు ఈరోజు మనోహర్, బాబు కళ్ళలో ఆనందం చూస్తుంటే వారి మిషన్ పూర్తయ్యిందన్న భావన కలుగుతోందని వ్యంగ్యంగా అన్నారు.

యుద్ధానికి సిద్ధం అని పవన్ అంటున్నారని, తాము కూడా సిద్ధంగా ఉన్నామని గుడివాడ ప్రతిస్పందించారు. ప్రజలు మరోసారి వారికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పవన్ సినిమాల్లో హీరో పాత్ర పోషిస్తున్నారని, కానీ రాజకీయాల్లో మాత్రం విలన్ గా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.  విశాఖ  ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని కాకూడదన్న సంకల్పంతో బాబు పని చేస్తున్నారని,ఆయనకు మద్దతుగా పవన్ నిలుస్తున్నారని, ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఉత్తరాంధ్ర ఆకాంక్షలు నెరవేరి విశాఖ రాజధాని అయితీరుతుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.

Also Read: ఉనికి చెప్పేలా విశాఖ గర్జన: మంత్రి గుడివాడ

RELATED ARTICLES

Most Popular

న్యూస్