Sunday, November 24, 2024
Homeసినిమా'అహింస'లో సిల్లీగా అనిపించే సీన్స్ ఇవే! 

‘అహింస’లో సిల్లీగా అనిపించే సీన్స్ ఇవే! 

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’ సినిమా మొన్న శుక్రవారం థియేటర్లకు వచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా అభిరామ్ ఎంట్రీ ఇవ్వడం .. సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెరిసిన గీతికకు కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. విలేజ్ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథల్లో ఇది ఒకటి .. అలాగే తేజ నుంచి వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో చేరిన సినిమా ఇది. అయితే గతంలో తేజ నుంచి వచ్చిన  లవ్ స్టోరీస్ స్థాయిలో ఈ సినిమా నిలబడలేకపోవడం ఆశ్చర్యం.

ఈ సినిమాలో కథాకథనాలను .. తేజ అల్లుకున్న సన్నివేశాలు చూస్తే, ఈ కథ ఏ కాలంలో నడుస్తుంది? మనలను ఏ కాలానికి తీసుకుని వెళ్లాడు? అనే ఒక డౌట్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కొన్ని సన్నివేశాలను చూస్తే .. ఇది తేజ సినిమాయేనా? అనే సందేహం కలుగుతుంది.  ఫారెస్టులో ఉంటున్న హీరో .. హీరోయిన్లను చంపడానికి రౌడీలు తరుముతుంటారు. హీరోయిన్ ను ఒక చెట్టు చిటారున తాడుతో వ్రేళ్లాడదీస్తాడు హీరో. శత్రువులు ఏ వైపు నుంచి వస్తున్నది తనతో చెప్పమంటాడు. నిజం చెప్పాలంటే ఆమెను చంపడానికి శత్రువులకు అది ఇంకా తేలికైన పని.

ఇక హాస్పిటల్ నుంచి హీరోయిన్ ను హీరో ఒక చిన్న ట్రాలీలో తప్పిస్తాడు. చిన్నపిల్లలు ఆడుకునే స్థాయిలో ఉన్న ఆ ట్రాలీలో ఆమెను కొండలు .. కోనలు .. జలపాతాలు దాటిస్తాడు. కాలినడకన వెళ్లడానికి కూడా కుదరని ఆ ప్రదేశాల్లో వాళ్లు ఆ ట్రాలీతో పాటు కనిపిస్తారు. ఇక విలన్ కత్తి పట్టుకుని సదా వెంటపడే సీన్ ఒకటుంది. పూర్వం యుద్ధాల్లో ఉపయోగించిన ఖడ్గాన్ని కూడా మించిపోయిన స్థాయిలో ఆ కత్తి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టపగలు ఆమెను చంపడానికి అతను వెంటపడుతూ ఉంటే, ఊళ్లో పుట్టపురుగు కూడా కనిపించదు. ఊళ్లో జనాలు చూసినా పట్టించుకోనట్టు చూపించడం వేరు .. అసలు జనాలే లేకుండా ఊరును చూపించడం వేరు.

ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటి సిల్లీ సీన్స్ ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. తేజకి సినిమాలు కొత్తకాదు .. సినిమాలు తీయడం కొత్తకాదు. సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయన సొంతం. ఇక సినిమాటోగ్రఫర్ గా ఆయనకి ఉన్న అనుభవం గురించి తెలిసిందే. కథాకథనాలపై మంచి పట్టు ఉన్న దర్శకుడు. అయినా ఈ సినిమా విషయంలో ఎందుకు ఇలా జరిగిందా అనేదే ఇప్పుడు ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.

RELATED ARTICLES

Most Popular

న్యూస్