వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులతోనే బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తనకు లెఫ్ట్, రైట్ అనే తేడా లేదని అందరూ కలిసి వస్తే సంతోషమని… కానీ లెఫ్ట్ పార్టీలు సిద్దాంతపరంగా బిజెపితో కలిసి పోటీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తమ గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడారు.
తనను సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే పొత్తులకు అంగీకరించాలంటూ కొందరు చేస్తున్న వాదనను పవన్ తప్పు బట్టారు. గత ఎన్నికలో 137 సీట్లు తాము పోటీ చేసినప్పుడు కనీసం 30-40 స్థానాల్లో గెలిపించి ఉంటే ఇప్పుడు సిఎం పదవి కోసం డిమాండ్ చేసే పరిస్థితి ఉండేదన్నారు. కర్ణాటకలో గతంలో కుమారస్వామి కింగ్ మేకర్ గా ఎదిగి సిఎం పదవి చేపట్టిన అంశాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో సిఎం అభ్యర్ధిపై ఎలాంటి కండీషన్ లేదని విస్పష్టంగా పవన్ ప్రకటించారు. పొత్తుల కోసం సిఎం అభ్యర్ధిత్వమే ప్రామాణికం కాదన్నారు. సిఎం పదవి తమను వరించి రావాలి కానీ సిఎం చేయమని తెలుగుదేశం పార్టీని, బిజెపిని అడగలేనన్నారు. ముఖ్యమంత్రి పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఒకవేళ తాను టిడిపి, బిజెపి అధ్యక్షుడిని అయి ఉన్నా తాను వేరే పార్టీల నేతలను సిఎం గా ప్రకటించే పరిస్థితి ఉండదని నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో తమకు 7 శాతం ఓట్లు వచ్చాయని, కానీ తర్వాతి పరిణామాల్లో కొన్ని ప్రాంతాల్లో తమ బలం 30నుంచి 36 శాతం వరకూ పెరిగిందని, సరాసరి 15శాతం వరకూ బలం పెరిగిందని… దాని ప్రకారం తాము బలంగా ఉన్న ప్రాంతాలో పోటీ చేసి తీరుతామని చెప్పారు. ఢిల్లీ లో మొన్న బిజెపి నేతలతో జరిగిన చర్చల్లో కూడా పొత్తుల అంశంపై జెపి నడ్డాతో చర్చలు జరిపామన్నారు. వారిని కూడా పొత్తులకు ఒప్పిస్తున్నామని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని పునరుద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జూన్ నుంచి ఇక్కడే ఉండి క్షేత్ర స్థాయిలో మరింత విస్తృతంగా పర్యటిస్తానని వెల్లడించారు.