Saturday, January 18, 2025
HomeTrending Newsగాయక గంటం...సుస్వర కంఠం.

గాయక గంటం…సుస్వర కంఠం.

The True Legend:
గాయక గంటం…సుస్వర కంఠం.
ఆ గాత్రానికి నూరేళ్లు
కాదు….కాదు…
తెలుగు.. తమిళ.. సంస్కృత..కన్నడ భాషలు
బతికున్నంత కాలం…..
మానవుడు సంగీతాన్ని
విన్నంత కాలం ఆ కంఠం చిరంజీవే!!

ఆ కంఠమే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను తియ్యని తెలుగులో తొలిసారిగా మేలుకొలిపింది….
ఆకంఠమే అన్నమయ్య వంశీకుల తరువాత స్వామి సమక్షంలో సుస్వరాభిషేకం చేసితరించింది…
ఆ కంఠమే తెలుగునాట శ్యామలాదండకాన్ని పశులకాపరుల నాలుకలపై సహితం లాస్యమాడించింది….
ఆ కంఠమే ఏడుకొండలమెట్లూ ఎక్కించి ఎంకన్న బాబును చూపించి ఆర్తి తీర్చిపెట్టింది…..
ఆకంఠమే అష్టపదుల మాధుర్యాన్ని సామాన్యుల చెంతకు చేర్చింది…
ఆకంఠమే భక్తి గీతాలకు సరిక్రొత్త ఒరవడిని తీర్చి దిద్దింది…..
ఆకంఠమే అచ్చ తెనుగు పద్యాన్ని తీయని తేనెలతో అభిషేకించింది….
ఆకంఠమే దేశప్రజకు స్వాతంత్ర్యమే జన్మహక్కని నినదించింది…..
ఆకంఠమే అందుకోసం చెఱసాలను పృదుశాలగా భావించింది….
ఆకంఠమే ఏలుదొరలు జానపదాలను ఆదరించాలని నిండు కొలువులో గురుసాక్షిగా ఎలుగెత్తి చాటించింది…
ఆకంఠమే గతమెంతో ఘనకీర్తి కలిగిన తెలుగోడికి జైకొట్టింది….


ఆకంఠమే విశ్వకోకిల సరోజినమ్మకు కన్నీటితో గద్గదంగా వీడుకోలిచ్చింది…
ఆకంఠమే అత్తా కోడళ్ళ దెప్పుల రోకటి దంపుళ్ళు దంచింది….
ఆకంఠమే పెళ్ళికాని తల్లి బిడ్డను డోలాయంగా గంగరేవులో చూపించింది….
ఆకంఠమే పూలకూ మనసున్నాదని వాటిపై గోరానితే హంతకులమవుతామని హెచ్చరించింది…
ఆకంఠమే ఉన్నోళ్ళందరం పోయినోళ్ళ తీపిగురుతులమంది…
ఆకంఠమే బహుదూరపు ప్రయాణానికి సంసిద్దంగా ఉండమంది…..
ఆకంఠమే ఎవరో ఏదో చేస్తారని ఉద్దరిస్తారని ఎదురుచూడద్దంది….
ఆకంఠమే నీతికి నిలబడి నిజాయితీగా ముందుకు పదమంది…..
ఆకంఠమే”జాతస్యహి ధృవో మరణం” అని గీతాబోధజేసింది….

కాని ఆకంఠానికి మాత్రం మరణంలేదు…
సూర్య చంద్రులున్నంత కాలం
మన్నూమిన్నులున్నంతకాలం నినదిస్తూనే ఉంటుంది
తెలుగు తేనెలను ప్రవహంపజేస్తూనే ఉంటుంది….
ఆ కవిగాయక గంటం..సుకంఠం..

RELATED ARTICLES

Most Popular

న్యూస్