No distance: జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అయితే నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఆప్షన్స్ విషయంలో తమ పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. బిజెపి జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్ర స్థాయిలో పొత్తులపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండదని, పొత్తులపై ఎలా ముందుకెళ్ళాలనే అంశాన్ని తమ పార్టీ జాతీయ నేతలు మార్గదర్శనం చేస్తారని వ్యాఖ్యానించారు. బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కో- ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ లు ఎప్పటికప్పుడు జనసేన నేతలు పవన్, నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరుపుతూ సమన్వయం తోనే ముందుకు వెళుతున్నారని చెప్పారు. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ వచ్చిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ కరోనా కారణంగా నేతలం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరపలేకపోయామని, ఈ నేపథ్యంలోనే పవన్ అలా మాట్లాడి ఉంటారని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సుశాసన్, గరీబ్ కళ్యాణ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో గృహ సంపర్క్ కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రెండు పార్టీలూ సమన్వయం తోనే వెళుతున్నాయని, రాయలసీమలో జరిగిన తమ పార్టీ సభకు జనసేన నేతలు కూడా వచ్చారని ఆమె గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే ముందుకు వెళ్తామని ఆమె వెల్లడించారు. తమ పార్టీ విధానం ప్రకారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేసున్నామని, ఈ విషయమై జనసేనతో చర్చించామని పురంధేశ్వరి తెలిపారు. జనసేన తమకు మద్దతు ఇస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.