Vizag Rishikonda: రిషికొండపై సిఎం జగన్ కోసం ప్యాలెస్ కడుతున్నట్లు బైట ఉన్న ప్రచారంలో వాస్తవం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వెల్లడించారు. కొన్ని విలాసవంతమైన విల్లాలు, రూమ్స్, ఫంక్షన్ హాల్స్ మాత్రం అక్కడ కడుతున్నారని చెప్పారు. కోర్టు అనుమతితో రిషికొండను సందర్శించిన నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడేదో సిఎంకు పెద్ద భవంతి కడుతున్నారంటూ బైట జరుగుతోన్న ప్రచారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అసలు అక్కడ ఏం జరుగుతుందో మీడియాకు తెలియజేస్తే ఇంత రాద్దంతం జరిగి ఉండేది కాదని, రహస్యంగా ఉంచడం వల్లే సిఎం ప్యాలెస్ అంటూ వార్తలు వచ్చాయన్నారు.
అయినా విల్లాలు, రిసార్టుల పేరుతో సహజ సిద్ధమైన రిషికొండను తవ్వడం దారుణమని, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ ప్రకృతి సౌందర్యాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. రిషికొండ లేకపోతే విశాఖకు అందం రాదని, నగరం తన సహజత్వాన్ని కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. టెంకాయకు పైన పిలక మాదిరిగా ప్రస్తుతం రిషికొండ పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇది ఒకరకంగా పర్యావరణం, సంస్కృతిపైన శారీరక దాడి చేస్తున్నట్లే లెక్క అని ఘాటుగా విమర్శించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత మరోసారి మీడియాతో సహా నేతలను చూసేందుకు అనుమతిస్తామని అక్కడి అధికారులు చెప్పారని నారాయణ వివరించారు. అక్కడ నిర్మాణాలు చట్ట ప్రకారమే జరుగుతున్నా, నైతికంగా సరికాదని పేర్కొన్నారు.