రాబోయే ఎన్నికలు జగన్ కు – ఐదు కోట్ల ఆంధ్రులకు మధ్య జరగనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో బాబు మీడియాతో మాట్లాడారు. చెడు ఎప్పటికైనా ఓడిపోతుందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల తిరుగుబాటు మొదలైందని, పులివెందులలో కూడా ప్రజలు ఎదురు తిరిగారన్నారు. ప్రజలు తామేం కోరుకుంటున్నారో ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా చెప్పారని, ఈ ఫలితం ద్వారా భవిష్యత్ ఎలా ఉంటుందనే అంశంపై ఉగాది పంచాంగం రెండ్రోజుల ముందే చెప్పినట్లయిందని అన్నారు. జగన్ మళ్ళీ గెలిచే పరిస్థితి ఏమాత్రం లేదని, అయన చేసిన చేసిన అరాచకం, విధ్వంసం,. రాష్ట్రానికి చేసిన ద్రోహమే అతన్ని ఓడిస్తాయని తేల్చి చెప్పారు. వైసీపీ గాలికి వచ్చిన పార్టీ అని గాలికే పోతుందని విమర్శించారు. వైసీపీ ని ‘వై ఛీ పో’ గా బాబు అభివర్ణించారు. నిన్నటి ఎన్నికల్లో 108 నియోజక వర్గాల్లో ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజక వర్గాల్లో ఎప్పుడూ లేని విధంగా 70శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. ఈ ఓటమిని స్వీకరించే పరిస్థితిలో కూడా వైసీపీ లేదన్నారు.
నాలుగేళ్ళనుంచి రాష్ట్రంలో విధ్వంసక పాలన కొనసాగిస్తున్నారని, జగన్ తన అక్రమాల్లో అధికారులను కూడా భాగస్వాములను చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే వారు మీ మీద పడతారు కాబట్టి మీరు తనకు సహకరించాలని, తెలుగుదేశం రాకూడదంటూ పోలీసులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, కానీ ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని రెండు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్ధి గెలిచిన తరువాత డిక్లరేషన్ ఫాం ఇవ్వడానికి ఇంత సమయం తీసుకోవడంపై బాబు విస్మయం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్ధిని కుక్క కంటే హీనంగా లాక్కొని వెళతారా అంటూ నిలదీశారు.
రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న జగన్ కు ఇంకా అండగా ఉండొద్దని వైసీపీ నేతలకు సూచించారు. ఈ విజయాన్ని ఓ బాధ్యతగా తీసుకోవాలని, అహంభావం పనికి రాదనీ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఇంకా విశ్వాసంగా పనిచేయాలని టిడిపి శ్రేణులను కోరారు.