Wednesday, September 25, 2024
HomeTrending Newsకన్నా పనికి రాడనే.... : కొడాలి కామెంట్

కన్నా పనికి రాడనే…. : కొడాలి కామెంట్

కన్నాలక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి 0.8శాతం ఓట్లు వచ్చాయని, ఆయన ఆ పోస్టుకు పనికి రాడనే బిజెపి పెద్దలు తీసేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కన్నా వెళ్లి టిడిపిలో చేరారని, ఈ ఇద్దరు వృద్ధులు ఏం చేయగలుగుతారని బాబు, కన్నాలను ఉద్దేశించి అన్నారు. లోకేష్ చిటికెల వ్యాఖ్యలపై కొడాలి స్పందించారు. బాబు చిటికేసినా, లోకేష్ చప్పట్లు కొట్టినా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదా అని వ్యంగ్యంగా అడిగారు. తన స్నేహితుడు వైఎస్ కు సింహం లాంటి కొడుకు జగన్ పుడితే, తనకు ఈ లోకేష్ లాంటి వాడు పుట్టాడని బాబు ఆవేదన, బాధతో రగిలిపోతుంటారని అన్నారు.

ఎమ్మెల్సీలలో 18 ఖాళీల్లో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సిఎం జగన్ అవకాశం ఇస్తే దాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేసేందుకే  గన్నవరం డ్రామా నడిపారని నాని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ మనం వినని కులాలకు కూడా ప్రాధ్యాన్యం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తే దాన్ని తట్టుకోలేక పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపారని ఆరోపించారు. ఎమ్మెల్సీలను ప్రకటించిన రోజే  పట్టాభి గన్నవరం వెళ్లి పిల్ల సైకో అంటూ వంశీపై ఛాలెంజ్ చేశారని అన్నారు. పార్టీ ఆఫీసులో కూర్చొని దమ్ముంటే రావాలని సవాల్ చేసినందుకే తమ పార్టీ కార్యకర్తలు అక్కడకు వెళ్ళారన్నారు. అసలు పట్టాభిని గన్నవరం ఎవరు పంపారని నాని ప్రశ్నించారు.  గన్నవరంలో సిఐపై కర్రతో పట్టాభి దాడి చేశారని, అయినా పోలీసుకు కేసు నమోదు చేయకూడదా అని నిలదీశారు. గొడవను నివారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వారిపైనే ఆరోపణలు చేయడం ఎంతవరకూ సబబని అడిగారు. సిఎం జగన్ ను తిట్టడానికి ఎవరో ఒకడు కావాలని పట్టాభి లాంటి పనికిమాలిన వాడిని పెట్టుకున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బిసి నేతలను కొట్టారని ఆరోపిస్తున్న టిడిపి నేతలు.. ఈ కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న టిడిపి బిసి నేతల ఇళ్ళకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని, ఒక్క పటాభి ఇంటికే బాబు ఎందుకు వెళ్ళారని కొడాలి సూటిగా ప్రశ్నించారు.

పట్టాభి చుట్టూ ఏపీ రాజకీయాన్ని తిప్పాలని ఈనాడు, చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుడు అని చెప్పుకొనే ఓ పెద్దమనిషి తన పత్రిక ద్వారా రాస్త్రాన్ని తానె నడిపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని, ఇది ఒకప్పుడు చెల్లింది కానీ, ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ఏం చెబితే అదే జరుగుతుందని, తాము ఐదారుగురం కలిసి సిఎం జగన్ ను పదవి నుంచి దించుతామనే భ్రమల్లో ఎల్లో మీడియా అధిపతులు ఉన్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Gudivada : ఎవరైనా నేను రెడీ: కొడాలి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్