రష్యా, ఇజ్రాయల్ హుంకరింపులతో అంతర్జాతీయంగా కలకలం నెలకొంది. రెండు దేశాలు ఉన్మాదంగా వ్యవహరిస్తున్నాయి. సైనికంగా బలంగా ఉన్న రెండు దేశాలు శత్రువును నిలువరించే వరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పాయి. తమ లక్ష్యాల్ని సాధించేవరకు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చోటులేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో (2024 మార్చి 17న) రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నవేళ ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత పుతిన్ మీడియా ముందుకు రావటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రష్యా పౌరులు వివిధ అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోసారి సైనిక సమీకరణ చేపడతారా? పౌరుల్ని బలవంతంగా యుద్ధ క్షేత్రంలోకి పంపుతారా? అని పుతిన్ ముందు సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడా అవసరం లేదని పుతిన్ సమాధానమిచ్చారు.
2021 తరువాత మొదటిసారి గురువారం (డిసెంబర్-14) మాస్కోలో జరిగిన మీడియా, టెలిఫోన్ కాల్, వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విలేకర్లు, రష్యన్ పౌరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, గాజా సంక్షోభం, రష్యా ఆర్థిక పరిస్థితి.. అంశాలపై వివరణ ఇచ్చారు. 24 ఏండ్లుగా రష్యాను ఏలుతున్న పుతిన్ మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. బలమైన ప్రత్యర్థి ఎవరూ లేకపోవటంతో పుతిన్ ఎంపిక లాంఛనమేనని అంచనా.
ప్రాంతీయంగా పట్టు సాధించి రష్యాను ఏకాకి చేయాలని భావించిన అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు బాసటగా ఉన్నా ఫలితం లేకపోయింది. రెండు దేశాల మధ్య సయోధ్యకు అవకాశం ఉన్నా పశ్చిమ దేశాల స్వార్థపూరిత విధానాలకు ఉక్రెయిన్ బలిపశువు అవుతోంది.
ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉండే అమెరికా చెప్పినా యుద్ద విరమణకు ఇజ్రాయల్ వినటం లేదు. హమాస్ ను అంతమొందించటం ప్రధాన లక్ష్యమని యూదు నేతలు తెగేసి చెపుతున్నారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలన్న అంతర్జాతీయ సమాజం వినతిని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. మేం చివరి వరకు యుద్ధం కొనసాగిస్తాం. అందులో మరో ప్రశ్న లేదు. మమ్మల్ని ఏదీ ఆపలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
హమాస్ ఉగ్రవాదులు సామాన్య ప్రజలను రక్షణ కవచం చేసుకొని ఇజ్రాయల్ మీద దాడులు కొనసాగిస్తున్నారు. ఇజ్రాయల్ వైఖరి చూస్తుంటే హమాస్ పేరుతో పాలస్తీనా వాసులకు గుణపాటం చెప్పి.. శాశ్వత పరిష్కారం కోసం పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది.
అటు తైవాన్ – చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ద రూపం సంతరించుకునే ప్రమాదం ఉంది. అన్ని పొరుగు దేశాలతో(రష్యాతోను విభేదాలు) సరిహద్దు వివాదాలు ఉన్న చైనా తన సైనిక సత్తా ప్రపంచానికి చాటేందుకు ఉవ్విలూరుతోంది.
ఇప్పటికే ఆఫ్రికా దేశాలను ఆహార కొరత వేదిస్తోంది. క్రమంగా దక్షిణ అమెరికా, ఆసియా దేశాలను కరువు, ఆహార కొరత కబలిస్తోంది.
యుద్దాలకు పరిష్కారం కనుగొనకపోతే ప్రపంచ దేశాలు సమస్యల సుడిగుండంలోకి చేరుకోక తప్పదు. ఫార్మ, రక్షణ వ్యాపారుల మాఫియా నుంచి బయటపడి… అగ్రదేశాలు నిస్వార్థంగా మసలుకోపోతే ఫలితాలు అనుభవించక తప్పదు.
-దేశవేని భాస్కర్
Post Views: 75