Saturday, November 23, 2024
HomeTrending NewsBRS: కొంతమందికే బీ ఫామ్స్... ఎవరి లెక్కలు వారివి

BRS: కొంతమందికే బీ ఫామ్స్… ఎవరి లెక్కలు వారివి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఈ రోజు కొంతమందికే బీ ఫారాలు ఇవ్వటం కొత్త చర్చకు దారి తీస్తోంది. ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే అవకాశం ఉందా అని అనుకుంటున్నారు. ఇదివరకే ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ అందుతాయా?.. అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారు.

సిఎం కెసిఆర్ ప్రసంగం అభ్యర్థులకు సూచనలు, సలహాలతో ఎక్కువగా సాగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బీ ఫారాలతో పాటు ప్రతి అభ్యర్థికి 40 లక్షల చెక్కును పార్టీ తరపున అందచేశారు.

50 రోజుల ముందే అభ్యర్థుల లిస్టు ప్రకటించాక.. బీఫామ్స్‌ సిద్ధమవ్వలేదని కేసీఆర్ చెప్పడాన్ని నమ్మొచ్చా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిందని, దాదాపు 50 రోజుల తర్వాత బీఫామ్స్ సిద్ధంగా లేవని చెప్పటం…ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న గులాబీ అధినేత… బీఫామ్స్ సిద్దం అవ్వలేదనడం ఆ పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు  పరిగెత్తిస్తున్నాయి.

అసంతృప్తులు బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని… కొందరు ఎమ్మెల్యేలపై ప్రతికూల రిపోర్టులు ఉండడంతో వారిని మార్చేఅవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. 51 బీఫామ్స్ ఎవరెవరికీ దక్కాయనేది ఆసక్తికరంగా మారింది. బీఫామ్స్ వస్తాయని అభ్యర్థులు అందరూ సమావేశానికి వచ్చారు. బీఫామ్స్ దక్కనివారిలో ఆందోళన  నెలకొంది.

ఇవాళ్టి వ‌ర‌కు 51 బీ-ఫారాలు మాత్ర‌మే రెడీ అయ్యాయ‌ని, మిగ‌తావి రేపు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అయితే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి చనిపోగా ఆయన సమావేశానికి రాలేదు. వేముల బీ ఫారం ఎమ్మెల్సీ కవితకు అందించారు. సమావేశానికి వచ్చిన వారికి ఇవ్వకపోవటం సందేహాలకు తావిస్తోంది.

అయితే పార్టీ వర్గాలు ఈ అనుమానాల్ని తేలిగ్గా కొట్టిపారేశాయి. ఈ రోజు పార్టీ మానిఫెస్టో విడుదల, ప్రచారం ప్రారంభించటం…హుస్నాబాద్ బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ తొందరగా కార్యక్రమం ముగించారని విశ్వసనీయ సమాచారం. అయితే కొన్ని స్థానాలలో మాత్రం ఖచ్చితంగా మార్పులు ఉండే అవకాశం ఉందని గులాబీ నేతలు అంటున్నారు.

తెలంగాణలో కూడా తమిళనాడు సంప్రదాయాలు మొదలయ్యాయి. బీ ఫారాలు తీసుకున్న మెజారిటీ నేతలు సిఎం కెసిఆర్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. వ్యక్తి పూజ తారాస్థాయికి చేరింది అనేందుకు ఈ తీరుగ దండాలు పెట్టడమే నిదర్శనంగా చెప్పవచ్చు.

గత ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో అసంతృప్తి ఉండింది. అయితే సిఎం కెసిఆర్ ప్రచారానికి వెళ్ళగానే ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చింది. అందుకు రైతు బంధు సాయపడింది. ఈ దఫా మేనిఫెస్టోలో ఏం తాయిలం వేస్తారో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్