Bad Language Baba:
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥
భుజకీర్తులు, దండ కడియాలు, ముత్యాల హారాలు, పన్నీటి జలకాలు, సుగంధ్ర ద్రవ్య లేపనాలు, పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణలు… ఇవేవీ నిజమైన అలంకరణలు కావు. సంస్కారవంతమైన మంచి మాటలే మనిషికి అసలైన ఆభరణాలు.
* * *
ఈ మధ్య తరచూ పై మాటలు గుర్తు చేసుకోవలసి వస్తోంది. నిజానికి ఈ మాటలు చెప్పే అర్హత ఉందని మనం అనుకునే కొంతమంది బాబాలు, ప్రవచనకారులు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు విన్నాక వారికా మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
విచిత్రంగా పొద్దస్తమానం శరీరాన్ని, మనసును నియంత్రించుకోవడం ఎలాగో వివరించే పెద్దమనుషులే నోరుజారడం పెద్ద దుమారానికి దారి తీసింది. సహజంగానే భక్త గణం, మహిళా లోకం గొడవపడుతున్నారు.
అసలు ఈ పెద్దలకేమయింది? ఎందుకిలా మాట్లాడుతున్నారు?
ఇంగ్లీషులో ఒక సామెత ఉంది – ఒక్క తప్పు ద్వారా చేసిన వంద మంచి పనుల ఫలితం పోగొట్టుకోవద్దని. ఇప్పుడు జరుగుతున్నది అలాగే ఉంది. ఎందరినో తమ వ్యక్తిత్వంతో ప్రభావితం చేసిన వ్యక్తులు స్థాయి మరచి చేసిన వ్యాఖ్యల ఫలితాలు చూస్తున్నాం. సాధారణంగా ఎవరైనా ఆడవాళ్ళని కామెంట్ చేస్తే చదువు లేదనో, మూర్ఖులనో అనుకుంటాం. కానీ అన్నీ తెలిసి పదిమందికి చెప్పగల హోదాలో ఉన్నవారే ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. నిజానికి వీరు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నా ఒక్క మాటతో చెడ్డవారవుతున్నారు.
రాందేవ్ బాబానే తీసుకుంటే – ఆయన ఏనాడూ పూర్తి వస్త్రాలు ధరించకపోయినా సన్యాసిగా చేసే యోగ విన్యాసాలకు ఎందరో అభిమానులు. పతంజలి అనే బ్రాండ్ ఉత్పత్తులను వందల కోట్లకు తీసుకెళ్లిన బిజినెస్ మాన్. అయితే ఆమధ్య అల్లోపతి వైద్యంపై విమర్శలు చేసి, పెద్ద గొడవైతే క్షమాపణ చెప్పాడు. మాటజారితే తీసుకోలేరని తెలియదా! అయినా ఊరికే ఉండకుండా మళ్ళీ ప్రముఖులు ఉన్న సభలో మహిళల వస్త్ర ధారణపై అనుచిత వ్యాఖ్యలు, వెకిలి నవ్వులు విసిరాడు. ఆ సభలో ఉన్న మహిళలు ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలకు బాధపడే ఉంటారు. మరి అంతపెద్ద యోగా గురువుకు నాలుక నియంత్రించుకోవడం తెలియదనుకోవాలా? ఆలోచనలు దారి తప్పాయా? ప్రస్తుతం దేశమంతా ఇదే చర్చ. మహిళా కమిషన్, సంఘాలు నిరసనలు మొదలుపెట్టాయి.
ఆమధ్యన ఇలాగే ఒక పెద్దాయన తన సభల్లో ఆడవారి వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారనేలేదు. అక్కడా అంతే, ఆయన చెప్పిన మంచి కూడా ఆ వ్యాఖ్యల వల్ల పక్కకి పోయింది. ఇక ఉన్నత పదవుల్లో ఉన్నవారు, మంత్రుల స్థాయి వారు చేసే వ్యాఖ్యలు సరేసరి. అన్నీ తెలిసీ వాచాలత్వం నియంత్రించుకోలేకపోవడం ఏమిటో! జనం కనబడగానే ఏది పడితే అది మాట్లాడేయడమేనా విజ్ఞత? పోనీ ఇంత గొడవ జరిగాక అయినా స్పందించి పొరపాటు దిద్దుకుంటే బాగుంటుంది. వారికటువంటి మంచి బుద్ధి కలగాలని మహిళాలోకం ఆకాంక్ష. సబబే కదా!
-కె. శోభ
Also Read :