Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు: జగన్

విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు: జగన్

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం కొంతమందికి ఇష్టం లేదని, అందుకే వారు విద్యా రంగంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను వక్రీకరించడంతో పాటు… ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలనైతిక స్థైర్యం దెబ్బతినేలా ఒక పద్ధతిప్రకారం వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెకండ్ సెమిస్టర్ పాఠ్య పుస్తకాలు ఇంకా విద్యార్ధులకు ఇంకా అందలేదంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తలపై సమావేశంలో చర్చ జరిగింది. డిసెంబరులో సెకెండ్‌ సెమిస్టర్‌  ప్రారంభం అవుతుందని, ఈ విషయాన్ని అకడమిక్‌ క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నామని,  అయితే…. సెకెండ్‌ సెమిస్టర్‌ ప్రారంభమైనా ఇంకా పుస్తకాలు అందలేదంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశారని అధికారులు పేర్కొన్నారు.

దీనిపై సిఎం స్పందిస్తూ ‘రాజకీయంగా జగన్‌ను ఇబ్బందిపెటాలి కాబట్టి, ఇలాంటి కథనాలు రాస్తున్నారు, రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ  సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో స్థైర్యం దెబ్బతినేలా నిరంతరం కథనాలు రాస్తున్నారు’ అంటూ జగన్ విస్మయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చామని, పుస్తకాల్లో జోడించిన అదనపు సమాచారం వల్ల, బైలింగువల్‌ కాన్సెప్ట్‌ వల్ల టెక్ట్స్‌ బుక్‌ సైజు పెరిగిందని, అందుకే దీంతో టెక్ట్స్‌ బుక్‌ను సెమిస్టర్‌ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నామని సిఎం వివరించారు.

గతంలో స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండేదని, ఆ విధానంలో మార్పు తెచ్చామని బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్‌ అందిస్తూ…. స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తున్నామమని సిఎం జగన్ తెలిపారు.

సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌, నాడు-నేడు ద్వారా లభిస్తోన్న ఫలితాలు, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్ధుల సంఖ్య పెరుగుదల, డిజిటలైజేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ రూమ్స్‌, బైజూస్‌ కంటెంట్‌, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌, గోరుముద్ద, మధ్యాహ్న భోజనం అంశాలపై కూడా ప్రగతిని సిఎం అడిగి తెలుసుకున్నారు.

సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల మౌలికవసతులు కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ మీనా, ఎస్‌ఎస్‌ఏ ఏఎస్‌పీడీ బి శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

Also Read : ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది: జగన్ ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్