Sunday, January 19, 2025
HomeTrending Newsపొత్తుల కోసం వేదిక: అంబటి విమర్శ

పొత్తుల కోసం వేదిక: అంబటి విమర్శ

Alliance Politics: వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సింగల్ గా వచ్చే దమ్ము ఏ పార్టీకీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజా ఉద్యమం అనగానే జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెంటనే స్పందించారని, తామూ అదే చెప్పామని, పొత్తుల గురించి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారని…. దీన్ని బట్టి వారిద్దరూ  పొత్తు కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. అంగడిలో వస్తువులాగా అమ్మకానికి పవన్ రెడీగా ఉంటారని, అయితే చంద్రబాబుకు మాత్రమే అమ్ముడు పోయే షరతు విధిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.  అధికారం లేకపోయే సరికి బాబు గందరగోళంలో ఉన్నారని, అందుకే రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయతిస్తున్నారని అంబటి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడారు.

మొన్నటివరకూ హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టించానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో మరుగుదొడ్లు కట్టించినట్లు చెప్పుకుంటున్నారని వ్యంగాస్త్రం విసిరారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు పన్నులు వేయలేదా అని అంబటి ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకంటే ఏపీలోనే పన్నులు ఎక్కువ అంటూ బాబు అంటున్నారని, కానీ ఏపీలో కంటే కర్ణాటకలో విద్యుత్ టారిఫ్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, మహారాష్ట్రలో బస్ చార్జీలు ఏపీ కంటే ఎక్కువ ఉన్నాయని ఈ విషయాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  బాబు తన ఉనికి కోసమే పర్యటనలు చేస్తున్నారని ఆయనకు ప్రజల నుంచి మద్దతు లేదని, మద్దతు ఉండి ఉంటే పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.  ప్రజలను రెచ్చగొట్టేందుకే బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా అమలుకాని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, ఎన్నికలకు తాము భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు.

Also Read : రిపీట్ అయితే… జాగ్రత్త: బాలినేని వార్నింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్