Tuesday, March 19, 2024
HomeTrending NewsLAC: సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు

LAC: సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు

భారత హిమాలయాలలోని లఢక్‌, అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గుట్టుచప్పుడు కాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమానాలకు తావిస్తున్నది. లఢక్‌కి సమీపంలోని హోటన్‌, గారీ గున్‌సా, అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలోని లాసా వంటి కీలక ప్రాంతాల్లో డ్రాగన్‌ దేశం భారీ నిర్మాణాలను చేపడుతున్నట్టు ఈ పత్రిక వెల్లడించింది. 2020లో గల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగిన తర్వాత నిర్మాణాలను వేగవంతం చేసినట్టు వివరించింది. ‘ప్లానెట్‌ ల్యాబ్స్‌’ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్టు తెలిపింది.

ఎయిర్‌ఫీల్డ్‌లు, రన్‌వేలు, హెలీప్యాడ్‌లు, రైల్వే సదుపాయాలు, క్షిపణి కేంద్రాలు, తక్కువ సమయంలో బలగాలను ఎల్‌ఏసీ దగ్గరకు చేర్చడానికి రోడ్లు, వంతెనలు, యుద్ధ విమానాలను నిలిపి ఉంచేందుకు షెల్టర్లు మొదలైన వాటిని హోటన్‌, గారీ గున్‌సా, లాసా ప్రాంతాల్లో చైనా పెద్దయెత్తున నిర్మిస్తున్నట్టు పత్రిక వెల్లడించింది. దీనిపై స్పందించేందుకు భారత అధికారులు నిరాకరించినట్టు పత్రిక తెలిపింది. లఢక్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ ఎల్‌ఏసీ వద్ద ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైన్యం పైచేయి సాధించడం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని చైనా.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ నిర్మాణాలను చేపట్టినట్టు రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎల్‌ఏసీ సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. గతంలో ఎల్‌ఏసీ వద్ద దూకుడుగా వ్యవహరించిన చైనా బలగాలు… ఇప్పుడు ఏకంగా అక్కడ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి నిర్మాణాలు చేపట్టినట్టు ఓ సంస్థ తెలిపింది. భారత్‌-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) సమీపంలోని ఆక్సాయిచిన్‌ సరస్సు వద్ద చైనా ఆర్మీ నిర్మాణాలు చేపడుతున్నట్టు బ్రిటన్‌ కేంద్రంగా పని చేస్తున్న రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ (చతమ్‌ హౌస్‌) అనే సంస్థ తాజాగా వెల్లడించింది. రోడ్ల విస్తరణ, అవుట్‌పోస్టుల నిర్మాణం, వాటర్‌ఫ్రూప్‌ శిబిరాలు, సోలార్‌ ప్యానెల్‌ల ఏర్పాటు, పార్కింగ్‌ ప్రదేశాలు, హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. 2022 అక్టోబర్‌ నుంచి శాటిలైట్‌ ఫొటోలను విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించినట్టు ఆ సంస్థ పేర్కొంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మిలటరీ ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు అనుకూలంగా వీటిని నిర్మిస్తున్నట్టు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్