జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అని, కానీ రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో మాత్రమేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. ఎన్నికలు కాకముందే పవన్ కళ్యాణ్ విజయ యాత్రలు చేస్తున్నారని, మొన్నటి వరకూ పార్ట్ 1 జరిగిందని, ఇప్పుడు పార్ట్ 2 మొదలు పెట్టారని అసలు ఈ యాత్ర ఎందుకోసం చేస్తున్నారో చెప్పాలని, వారం రోజులు తిరక్గ్గాక నే ఆయనకు జ్వరం వచ్చిందని, కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తున్నారని,
రాజకీయమంటే ఓటిటి లో వచ్చే వెబ్ సిరీస్ అనుకుంటున్నారా అని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ పెరగడం లేదని, అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా ఆ పార్టీకి లేదని…. 2019 ఎన్నికల ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
సిఎం కావాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, పొత్తుల గురించి అడిగితే మాట్లాడడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. పవన్ తన పార్టీని టిడిపిలో విలీనం చేసేస్తే .. వచ్చే ఎన్నికల్లో జగన్ ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా వీళ్లిద్దరూ రాలిపోతారని అన్నారు. తమ పథకాల నుంచి రెండు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఒకటి, గోవా ప్రభుత్వం నుంచి ఒక పథకాన్ని కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని, హామీలు నిలబెట్టుకునే చరిత్ర లేని చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉందని స్పష్టం చేశారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు లో 13 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఏంవొయూలు చేసుకున్నామని, ఇవి కార్యరూపం దాల్చుతున్నాయని, ఒబెరాయ్ మూడు చోట్ల సెవెన్ స్టార్ తరహాలో హోటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అమర్నాథ్ వివరించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని… విశాఖపట్నం-చెన్నై, చెన్నై- బెంగళూరు, బెంగళూరు- హైదరాబాద్ కారిడార్ల మధ్య పారిశ్రామిక అవసరాల కోసం 50 వేల ఎకరాల భూములు సిద్ధం చేశామని వివరించారు.