బిసీలంతా సిఎం జగన్ ను నిండు మనస్సుతో ఆదరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం ఏమిటో చేతల్లో చేసి చూపిస్తున్నారని, బిసిలకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. శాసన మండలి అభ్యర్థుల ఎంపికలో 11 మంది బిసిలకు అవకాశం కల్పించడం అనేది ఒక సామాజిక విప్లవం లాంటిదన్నారు. తెలుగుదేశం పెత్తందారీ విధానాన్ని బద్దలు కొడుతూ వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని, దేశంలో మరెక్కడా ఇలా జరగడం లేదని, బిసిలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో బిసిలకు అవకాశాలు కల్పించలేదని స్పష్టం చేశారు. బిసిలు తలెత్తుకు తిరిగేలా జగన్ చేస్తున్నారన్నారు. గతంలో రాజ్యసభ సీట్లను 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్న చరిత్ర వారిదైతే, చరిత్రలో ఎప్పుడూ అవకాశంరాని వర్గాలను వెతికి మరీ పట్టుకొని వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తోన్న ఏకైక సిఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. తాడేపల్లిలోనివైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు.
తన భార్యను ఏదో అన్నారని సభనుంచి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చే అసెంబ్లీసమావేశాలకు హాజరై బిసిలకు వారి హయంలో ఏం చేశారో చెప్పాలని, సామాజిక న్యాయం ఎవరి హయంలో జరిగిందో చర్చించేందుకు సభకు రావాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బిసి నాయకులంతా ఆలోచించాలని హితవు పలికారు. బాబుకు తొత్తులుగా వ్యవహరించకుండా, ఆయన పెత్తందారీ విధానాలను వ్యతిరేకిస్తూ బైటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంతమంది బిసి కులాలకు శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలంతా సిఎం జగన్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న సిఎం జగన్ ను మరింత బలపర్చాల్సిన అవసరం మనదరిపైనా ఉందని, ఆయన అడుగులో అడుగు వేసి ఆయన్ను కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికోసం జ్యోతిబా పూలే కన్న కలలను జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు.
Also Read : మర్రికి అవకాశం – బిసిలకు పెద్ద పీట : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు