విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాను గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మా ఫాదర్ గుర్తొచ్చాడు. ఖర్చు విషయంలో ఆయన ఎంతో ఆలోచన చేసేవారు. అనవసరమైన ఖర్చులు పెట్టేవారు కాదు. నేను ఏదడిగినా ‘ఇప్పుడు కాదు .. తరువాత చూద్దాం’ అనేవారు. అప్పట్లో నాకు సైకిల్ కొనుక్కోవాలని ఉండేది. ఎప్పటికప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్ లో తీసుకుందామని అనేవారుగానీ .. కొనేవారు మాత్రం కాదు. ఆయన కొనకపోవడంతో నాకు ఆ సైకిల్ పై కోరిక మరింత పెరుగుతూ పోయింది” అని అన్నాడు.
“చివరికి నా బాధ పడలేక మా ఫాదర్ లేడీ బర్ద్ సైకిల్ ను సెకండ్ హ్యాండులో కొన్నారు. అది అమ్మాయిలు తొక్కే సైకిల్. మా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారని చెప్పి, మా అక్కయ్య సైకిల్ అని వాళ్లతో అబద్ధం చెప్పాను. అలా రెండేళ్లు అదే సైకిల్ వాడాను. ఇలా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎన్నో సర్దుబాట్లు ఉంటాయి. ఆ తరువాత కాలంలో అవన్నీ కూడా అందమైన జ్ఞాపకాలుగా మారతాయి. అలాంటి ఫీల్ ను ఈ సినిమా కలిగిస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పాడు. ఈ సినిమాలో విజయ్ పోషించిన పాత్ర పేరు గోవర్ధన్. విజయ్ దేవరకొండ తండ్రి పేరు కూడా గోవర్ధన్ కావడం కొస మెరుపు.