Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమింగ మెతుకు లేదు

మింగ మెతుకు లేదు

సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.

పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను తామే తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లు దొరకడం ముఖ్యం కాబట్టి ఒకే ఫంక్షన్ హాల్లో పొద్దున ఒక పెళ్లి, సాయంత్రానికి మరో పెళ్లి జరగాలి కాబట్టి ఆధునిక వివాహాలు గంటల్లోకి కుచించుకుపోయాయి. భవిష్యత్తులో నిముషాల్లోకి దిగుతాయి.

నేను సమాజంలో పెద్దవాడిని కాకపోయినా, పెద్దవారనుకునేవారితో ఎక్కువగా తిరుగుతుండడంవల్ల వాళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటారు. చాలాసార్లు నాకెందుకో ఆదేశించినట్లుగా అన్వయమవుతూ ఉంటుంది. ధ్వని అర్థం చేసుకోలేక తప్పు నాదే కావచ్చు. పెద్దవారి పెళ్లిళ్లు ఊరికి దూరంగా జరుగుతూ ఉంటాయి. కటికచీకటిలో దారితప్పిన యాత్రికుల్లా రోడ్డుమీద కనపడ్డ ప్రతివారినీ అడ్రెస్ అడుక్కుంటూ ఆ ఫంక్షన్ హాల్లోకి ప్రవేశిస్తాను. బౌన్సర్లు, సాయుధ బాడీ గార్డులు, మెటల్ డిటెక్టర్లు చూడగానే అమెరికా రక్షణ ప్రధాన రహస్య కార్యాలయకేంద్రం పెంటగాన్ లోకి ప్రవేశించిన భయంతో కూడిన ఆందోళన మొదలవుతుంది. జాతరలో తప్పిపోయిన మనుషుల్లా అందరూ సెల్ ఫోన్లలో ఎవరు ఏ మూల ఇరుక్కుపోయారో చెప్పుకుంటూ ఉంటారు. ఈలోపు నన్ను గుర్తుపట్టి వేదికమీదికి నన్ను ఎత్తుకెళ్లగలిగే బాహుబలికోసం నేను దిగులు దిగులుగా చూస్తూ ఉంటాను. అదృష్టం బాగున్నప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు. లేనప్పుడు ఫంక్షన్ హాల్ గేటుకే నేను వచ్చినట్లు చెప్పి మర్యాదగా వెనక్కు వచ్చేస్తాను.

సోమాలియాలో అన్నార్థులకు ఐక్యరాజ్యసమితి ఆహార పొట్లాలను పంచుతుంటే దీనంగా క్యూలో నిలుచున్నట్లు బఫే భోజనం దగ్గర ప్లేట్ల కోసం నిలుచుంటాను. కొంత సహజమయిన పెనుగులాట తరువాత ప్లేటు దొరుకుతుంది. అందులోకి ఆహారం ముష్టి వేయించుకోవడానికి మళ్లీ క్యూలో నిలుచోవాలి. ఆ పింగాణీ ప్లేటే అయిదు కే జి ల బరువు. ఇకదానిమీద రెండు కే జీ ల ఆహారం అదనపు బరువు మోపడం ఎందుకని నాలుగుమెతుకులు అన్నం , కొంచెం పెరుగు వేసుకుని రెండోసారి బఫే లైన్లో నిలుచోవాల్సిన దుర్గతి రాకుండా మేనేజ్ చేస్తాను. లేదా అసలు పెద్దల పెళ్లిళ్లల్లో ప్లేటు పట్టుకునే సాహసమే చేయకుండా ఇంటికొచ్చి తింటాను. ఆ మధ్య ఒకాయన వాళ్ళింట్లో పెళ్ళిలో అయిదువేల మంది తిన్నారని తృప్తిగా చెప్పాడు. ఆ పెళ్ళిలోనే నాకు మెతుకు దొరకక రాత్రి పదకొండు గంటలప్పుడు ఇంటికొచ్చి పెరుగన్నం తిన్నా. అంటే ఆయన లెక్క తప్పని కాదు. నా లెక్క తప్పిందని.

నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పెద్దల పెళ్ళిళ్ళల్లో ఒక కిలోమీటర్ కు తక్కువ కాకుండా క్యూ ఉంటుంది. ఆ క్యూ ఎప్పటికీ కదలదు. ఈలోపు ఇంకా పెద్దలు నేరుగా వచ్చి అక్షింతలు చల్లి ఫోటోలకు ఫోజులిచ్చి వెళుతుంటారు. ఇక్కడ కూడా తప్పు వాళ్లది కాదు- క్యూలో ఉన్న మనదే.

చాలాసార్లు నేను ఆ పందిట్లో ఆ క్షణం ఉన్నానని సాక్ష్యం చెప్పగల ఒకడిని చూసి అతడి కంట్లో పడి బతుకుజీవుడా అని వచ్చేస్తుంటాను. వందల, వేల మంది హాజరయ్యే పెళ్ళిళ్ళల్లో వేదికదాకా వెళ్ళడానికి, భోంచేయడానికి కొన్ని యుద్ధవిద్యలు తెలిసి ఉండాలి. కొంత నైపుణ్యం, విపరీతమయిన చొరవ ఉండాలి. కొంత నిస్సిగ్గుగా ఉండాలి. కొంత నిర్మొహమాటంగా ఉండాలి. మరీ పెద్దలు వారి ఇళ్లల్లో పెళ్లిళ్లకు వారితో తులతూగగలిగినవారిని మాత్రమే పిలవాలి అని కోరుకోవడం అధర్మం. వారి అభిమానం వారిది. కాదనకూడదు. అక్కడికి వెళ్ళాక పందిట్లో రోల్స్ రాయిస్ వాడిని వాడి మానానికి వాడిని వదిలేసి లింగులిటుకుమంటూ ఓలా క్యాబ్ లో దిగిన మనల్ను కౌగిలించుకోవాలనుకోవడం, సాదరంగా ఆహ్వానించాలనుకోవడం సహజన్యాయ సూత్రాల ప్రకారం కూడా అధర్మమే అవుతుంది. అంతంత పెద్ద వారితో వారు వేదికమీద రాసుకు పూసుకు తిరగాల్సి ఉన్నప్పుడు మింగ మెతుకులేక కరువు సీమనుండి కాళ్ళీడ్చుకుంటూ వెళ్లిన మనకు ప్లేటు ఒక్కటే దొరికిందా? ప్లేటూ మెతుకులు కూడా దొరికాయా? అదృష్టం కొద్దీ తిండి దొరికినా…తిన్న తరువాత మంచి నీళ్లు దొరకక గొంతు పొలమారి…స్పృహదప్పి పడిపోయామా? అన్న చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాలనుకోవడం అన్యాయమే అవుతుంది.

ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదికతో ఆ పెళ్లి దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. సందడి. మెరుపు. తళుకు. కులుకు.
అక్కడ ఆ క్షణం మనం ఉండడం మన కోటి జన్మల పూర్వ పుణ్యఫలం.
మనల్ను పిలవడం వారి ఔదార్యం.
అన్నం, సున్నం, ఆకు వక్క, అతిథి మర్యాదలు, కొసరి కొసరి వడ్డించడాలు, తాంబూలాలు ఆశించకూడదు.
పిలిచారా…
వెళ్లామా…
వచ్చామా….అంతే.
పీడకలలా జరిగిన అవమానాన్ని మరచిపోవాలి. ఆకలికి మాడిన కడుపును ఓదార్చాలి. ఆ పెద్దవారు కనిపించినప్పుడు వారి పెళ్లిలో మనం తినని పదార్థాల రుచిని వేనోళ్ల వర్ణించాలి. జరిగిన అవమానాన్ని వారు మనకు చేసిన సన్మానంగా వర్ణించి మన చిన్న మనసు ఔదార్యాన్ని వారి పెద్ద మనసు ముందు ఆవిష్కరించుకోవాలి.

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు రావడమంటే ఏమిటో అకెడెమిక్ గా తెలిసినా…
పెద్దల పెళ్లిళ్లకు వెళ్లి అనుభవపూర్వకంగా మళ్లీ మళ్లీ తెలుసుకుంటూనే ఉండాలి!

ఈ కథనం పాతదే. ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే-
ఈమధ్య ఒక పెళ్లికి వెళితే…అక్కడ లేని పదార్థం లేదు. రోడ్డు మీద వరుసగా చిరు తిళ్ళ బండ్లు ఉన్నట్లు లెక్కలేనన్ని ఫుడ్ స్టాల్స్. ఒక ఖాళీ ప్లేటు పట్టుకుని మొదట దోసె దగ్గరికి వెళ్లా. అప్పటికే దోసె కోసం క్యూలో ఉన్న సోమాలియా శరణార్థులున్నారు. పది నిముషాలయినా దోసె దొరకదని…జిలేబీ వేస్తున్న కౌంటర్ దగ్గరికి వెళ్లా-స్వీట్ల బలహీనతతో. వేసినవి వేసినట్లు గద్దల్లా తన్నుకుపోతున్నవారి చొరవ నాకు లేక…జిలేబీ ఎలా తయారు చేస్తారో చూడగలిగాను కానీ…రుచి చూడలేకపోయాను. ఈలోపు ఎవరి ప్లేట్లోనో బిసిబేళి బాత్ కనపడింది. అదెక్కడ దొరుకుతుందో తిందామని పది నిముషాలు సిగ్గు విడిచి…మనసు చంపుకుని…ప్రతి కౌంటరు ముందు భవతీ! బిసిబేళి బాత్ భిక్షామ్ దేహి! అని బొచ్చె పట్టుకుని ప్రార్థించా. దేనికయినా రాసి పెట్టి ఉండాలి. ఎవరికి వారు చెయ్యి ఖాళీ లేదు…ముందుకు పొమ్మన్నారు. అక్కడికి మనసు వెయ్యి ముక్కలుగా విరిగి…నా ఆత్మాభిమానం నన్ను గేలి చేసింది. సింహం అన్నం లేకుండా చావనైనా చస్తుంది కానీ…గడ్డిపోచలు తింటుందా? అన్న భర్తృహరి నీతి శ్లోకం ఎందుకో పదే పదే గుర్తొచ్చింది. మనం కనీసం గ్రామసింహం కూడా కాదు కాబట్టి ఏదో ఒక గడ్డి కరవకపోతే…ఆకలితో స్పృహదప్పి పడిపోయే ప్రమాదం ఉందనిపించింది. సమయం మధ్యాహ్నం రెండు దాటుతోంది. ఇక లాభం లేదనుకుని పెరుగు కౌంటర్ ఖాళీగా ఉంటే…వాడి ముందు ప్లేటు చాచి పెరుగు యాచించాను. గడ్డ పెరుగు ఒక గరిటె వేశాడు. ఇంకో గరిటె వేయమన్నాను సిగ్గు విడిచి. వాడు చాలా అసహ్యంగా మొహం పెట్టి ముష్టి వేసినట్లు అత్యంత నిర్లక్ష్యంగా, అయిష్టంగా వేశాడు. అత్యంత సంస్కార హీనంగా నేను పెరుగు ఇంకో గరిటె వేయమని అడగ్గా…వాడి సున్నితమైన మనసు గాయపడినట్లు వాడు నాకు చెప్పకనే చెప్పాడు. అనవసరంగా అడిగానే అని నాలో నేనే దహించుకుపోయాను. “చేయి చాచి…యాచించే వేళ విశ్వరూపుడయినా వామనుడు కావాల్సిందే” అని వేయిపడగల్లో విశ్వనాథవారి ఓదార్పు మాట గుర్తుకు తెచ్చుకుని…సర్దుకుని…ఖాళీగా ఉన్న ఫ్రూట్ సలాడ్ కౌంటర్ వైపు వెళ్లాను. పది మిల్లీగ్రాముల బరువు తూగే ఒక ద్రాక్ష, పదిహేను మిల్లీగ్రాముల బరువు తూగే ఒక ముక్క యాపిల్, ఇరవై మిల్లీగ్రాముల బరువు తూగే ఒక ముక్క దోస ప్లేట్లో ముష్టి వేశాడు. పట్టపగలే ఆహారం దోచుకెళ్లే నాలాంటి గజదొంగల నుండి జాగ్రత్తగా ఉండాలని వాడి యజమాని క్యాటరర్ చెప్పినట్లున్నాడు. కోసిన పళ్ల ముక్కలను కౌంటర్ కింద పెట్టుకుని…డ్రగ్స్ పరిభాషలో మిల్లీ, మైక్రో గ్రాములుగా తూచి తూచి…దాచి దాచి…పరమాణు పరిమాణంలో వడ్డిస్తున్నాడు. అన్నం తినలేదురా నాయనా! పళ్లయినా ప్లేటు నిండా వెయ్యరా! అని అడగాలని ఉంది కానీ…అడిగితే వాడు నా పళ్లూడగొట్టి నా ప్లేట్లో పెట్టేలా కోపంగా ఉన్నాడు. ఇంకొక్క సెకను కౌంటరు ముందు నిలుచుంటే నార్కోటిక్స్ పోలీసులు దాడి చేస్తారన్నట్లు వెంటనే దూరంగా వెళ్లిపొమ్మని సైగచేశాడు. దాంతో ఒక ద్రాక్షనే మింగి…అందని ద్రాక్ష పళ్ళన్నీ పుల్లన అనుకుంటూ…పెద్దవారి పెళ్ళికి ఇంట్లో తిని అయినా వెళ్ళాలి…లేదా అక్కడ తినకుండా ఇంటికొచ్చి అయినా తినాలి…అని మరో మారు గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.

ఫలశ్రుతి:-
అయినా…నేనంటే బలహీనుడిని. పిరికి వాడిని. చొరవలేని వాడిని. సంఘంలో అనామకుడిని. ఆకలికి ఆగలేనివాడిని కాబట్టి నా అభోజన సందర్భాలు ఇలా అఘోరించాయి. మీకందరికి ఇలా జరిగి ఉండదులెండి!

“దేనికయినా రాసి పెట్టి ఉండాలి”
అన్నదే అక్షరాలా నిజం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్