భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి నేటికి వెయ్యి రోజులైంది. 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో 136 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో… దేనిలోనూ సెంచరీ సాధించలేకపోయాడు కోహ్లీ.
ఎమ్మెస్ ధోనీ తరువాత భారత క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టిన విరాట్ కోహ్లీ ఇంటా, బైటా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ప్రపంపంచంలోనే మేటి జట్టుగా ఎదిగిన టీమిండియా విజయ ప్రస్థానంలో కోహ్లీ పాత్ర మరువలేనిది. కానీ రెండున్నరేళ్ళుగా కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శన ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి పేరుతో గత ఏడాది టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ ను సిసిఐ తప్పించింది.
2019లో బంగ్లాదేశ్ తో సెంచరీ తరువాత 18 టెస్టు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 32 ఇన్నింగ్స్ లో కలిపి 824 పరుగులే చేశాడు. వీటిలో ఆరు అర్ధ సెంచరీ లు ఉండగా అత్యధిక స్కోరు 79. ఇక వన్డేల విషయానికి వస్తే గత సెంచరీ తరువాత 23 మ్యాచ్ లు ఆడిన విరాట్ 824 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 89. టి 20ల్లో 27 మ్యాచ్ లు ఆడి 858 పరుగులు చేశాడు, దీనిలో వ్యక్తిగత స్కోరు మాత్రం సెంచరీకి దగ్గరగా (98 నాటౌట్) వచ్చి ఆగిపోయింది.
జట్టులో యువ ఆటగాళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ఆడుతూ తమ స్థానాన్ని పదిలపరచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్ కొన్నాళ్ళు కొనసాగాలని అనుకుంటే విరాట్ కోహ్లీ తప్పకుండా తన ఆటకు పదును పెట్టి బ్యాట్ తో అలరించాల్సి ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో జట్టులో స్థానం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తప్పదు.
Also Read : ఇదో మధురానుభూతి: విరాట్ కోహ్లీ