Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రశ్నకొక రేటు

ప్రశ్నకొక రేటు

Leak linked with Life”

విధి:-
నన్నందరూ అపార్థం చేసుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు. దయచేసి పార్థం చేసుకోండి.

కాలం:-
మరి…”విధి బలీయమయినది” అని ఎందుకంటారు? విధి బలి కోరుకుంటుంది అనే అర్థంలో “బలీయం” అయ్యిందా? చాలా బలమయినది కాబట్టి “బలీయం” అయ్యిందా?

విధి:-
నేను కర్మ చేతిలో బందీని. “చేసిన కర్మము…చెడని పదార్థము…” అని అందుకే అన్నారు. గత కర్మలను బట్టి ప్రస్తుత ఫలం, ప్రస్తుత కర్మలను బట్టి భవిష్యత్ ఫలాలను ఇవ్వడాన్నే “విధి” అంటారు. అదే నా “విధి”.

కాలం:-
మరి…ఎవరో సర్వీసు కమిషన్ లో ప్రశ్న పత్రాలను జెరాక్స్ చేసి…ప్రేయసికి, బంధువులకు, స్నేహితులకు…ఆ ప్రేయసి మరి కొంతమందికి జెరాక్స్ చేసి పంచితే…మేమెందుకు బలి కావాలి? మేము భయంగా, బుద్ధిగా, శ్రద్ధగా చదివి పరీక్షలు రాశాము కదా? ఆ పరీక్షలు రద్దు అయితే…మేము బలి అయిపోలేదా?

విధి:-
విధి ఆడే వింత నాటకంలో ఇదొక అంకం- అంతే.

కాలం:-
ఏది వింత నాటకం?
తుమ్మితే ఊడిపోయే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాస్ వర్డ్ దొంగిలించి…ప్రశ్న పత్రాలు బజార్లో రేట్లు పెట్టి బహిరంగ వేలం వేసి అమ్ముకుంటే…వింత నాటకం అంటారా?

విధి:-
ఇంటికి పైకప్పు వేస్తాం…లీకవుతుంది.
ఇరిగేషన్ ప్రాజెక్టు కడతాం…లీకవుతుంది.
వేసవిలో కుండ కొంటాం…లీకవుతుంది.
గుండెలకే చిల్లులు పడే రోజులివి.
ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ఎలా ఉంటాయి?

కాలం:-
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుంది…లోకం చూస్తుంది.
తోక కుక్కను ఆడిస్తుంది…లోకం చూస్తుంది.
ధర్మం దారి తప్పుతుంది…లోకం చూస్తుంది.
ఖర్మ కాలిన గుండె రగులుతుంది…లోకం చూస్తుంది.

విధి:-
కర్మ బాగా కాలి ఖర్మగా మారి బూడిద మిగలడం ఒక ప్రకృతి సహజ పరిణామం.

కాలం:-
ఎవరి “విధి” వారు చేయడమే “విధి”. విధి విధానాలు దారి తప్పినప్పుడు విధ్యుక్త ధర్మం నిర్వర్తించనట్లే. అలాంటప్పుడు ఎంతటి విధినయినా ప్రశ్నించే కాలాలు ఉంటాయి. ఉండాలి.

ఇప్పుడిది రాజకీయ క్రీడలో వీధి పోరాటం అయ్యింది కానీ…లక్షల మంది బతుకు పోరాటమిది. నిరుపేద, మధ్య తరగతి తల్లిదండ్రులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి…గుండెలు బాదుకునే విషాదమిది. నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుకునే దుర్మార్గుల, అక్రమార్కుల మార్కుల వక్రమార్గమిది.

సంస్కారం నేర్పని చదువులు ఇచ్చిన సిగ్గులేనితనమిది.

విధి:-
మౌనం….

కాలం గుండె పగిలి ఏడుస్తోంది.
ఓదార్చండి ఎవరయినా…

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

టీచింగ్ టార్చర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్