Monday, January 20, 2025
HomeTrending Newsవిభజన హామీలపై ఢిల్లీలో ఆందోళన - కోదండరామ్

విభజన హామీలపై ఢిల్లీలో ఆందోళన – కోదండరామ్

కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాల తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేసీఅర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కీలకమైందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు TJS పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన కోదండరామ్…లిక్కర్ వ్యాపారంతో కవితకు ఏమీ పని అని ప్రశ్నించారు. తొమ్మిది ఏళ్లలో అడ్డగోలుగా తెరాస ప్రభుత్వం దోచుకుందని, నీళ్ళు, నిధులు, నియామకాల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదన్నారు.

కేసీఆర్ అస్తిత్వం కోసం తప్పితే తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోలేదని, రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే అరెస్టులు చేసి.. ఢిల్లీకి వెళ్లి కెసిఆర్  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని కోదండరామ్ అన్నారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ అవినీతిని ఎండగడుతామని, జనవరి 30 న డిల్లీలో సెమినార్, 31న విభజన హామీలపై ఆందోళన చేస్తామని వెల్లడించారు. 31న విభజన హామీలు, చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తామన్నారు. కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 10న నిరసన దీక్ష చేస్తామని, ఈ నెల 20న ధరణి సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.

గ్రామ పంచాయతీ నిధులను సైతం సర్కారు కొల్లగొట్టిందని, గ్రామ జ్యోతి పథకం ఏమైందో తెల్వదని కోదండరామ్ అన్నారు. నయా జాగీర్ధారి వ్యవస్థను చూస్తున్నాం.. ఇష్టానుసారంగా భూములను గుంజుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా బలోపేతం అవుతాం.. తెలంగాణను కాపాడుకుంటామన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని, తెరాస బారాసగా మారి ఎటుపోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడుతుందని ఎద్దేవా చేశారు. పొడు భూముల రైతులకు వెంటనే న్యాయం చేయాలని, అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

119 అసెంబ్లీ స్థానాలే మా పార్టీ లక్ష్యమని కోదండరామ్ స్పష్టం చేశారు. సెంటు చుక్క వాసన వచ్చే వాడు కాదు.. చెమట చుక్క కార్చేవారే మా అభ్యర్థి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులమంతా ఈ రోజు సమావేశం అయ్యామని, తెలంగాణవాదులమంతా ఐక్యమై తెలంగాణ వాదాన్ని రక్షించుకోవాలని నిర్ణయించామన్నారు. త్యాగాల పునాదిపైన ఏర్పడిన పార్టీ తెలంగాణ పేరును తొలగించిందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో Tjs పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇంచార్జ్ హన్మంత్ రెడ్డి, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రాం చందర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్